
* భారతీయులకు అమెరికా ఎంబసీ హెచ్చరిక
వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీచేసింది. ఈ అంశంలో ఉల్లంఘనలకు పాల్పడితే ఎదుర్కోవాల్సిన తీవ్ర పరిణామాలను స్పష్టంగా వెల్లడించింది. వీసా రూల్స్‌ను ఉల్లంఘిస్తే బహిష్కరణ ముప్పు తప్పదని, అదేవిధంగా భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. టూరిస్ట్, స్టూడెంట్స్, వర్క్ పర్మిట్స్ సహా వివిధ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి అమెరికా ఎంబసీ ఈ హెచ్చరిక చేసింది. అమెరికా ప్రయాణంపై నిషేధం పడితే భవిష్యత్తులో అక్కడ చదువు, వృత్తి, వ్యక్తిగత అవకాశాలపై గణనీయమైన ప్రభావం పడనుంది.
నిర్దేశిత గడువు ముగిసినా అనుకోని పరిస్థితుల కారణంగా దేశాన్ని వీడటంలో ఇబ్బందులు ఏర్పడితే.. చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా ఉండేందుకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్ సిఐఎస్) ను సంప్రదించాలని ఎంబసీ అధికారులు సూచించారు. ఇదిలావుంటే అమెరికాలో గడువుకు మించి ఉంటున్నవారు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అక్కడి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం గతంలోనే హెచ్చరికలు చేసింది.
‘అమెరికాలో 30 రోజులకపైగా నిబంధనలకు మించి నివసిస్తున్నవారు కచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి అపరాధ రుసుం, జైలు శిక్షలు విధిస్తారు. అందుకే ఇప్పుడే సొంతంగా వెళ్లిపోండి’ అని హెచ్చరించింది.
More Stories
2024లో తీవ్ర స్థాయికి బాలలపై హింస
కోయంబత్తూర్ కారు బాంబు కేసులో మరో నలుగురు అరెస్ట్
వీసాల అనిశ్చితతో అమెరికాలో చదువులపై వెనకడుగు!