
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌తో భారత్ బదులు తీర్చుకున్న విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత ప్రతిదాడులకు యత్నించిన క్రమంలో పంజాబ్ లోని అమృత్‌సర్ లో గల స్వర్ణ దేవాలయాన్ని పాకిస్థాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో లక్ష్యంగా చేసుకున్నట్లు 15వ ఇన్‌ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి సోమవారం వెల్లడించారు.
అయితే, ఆ దాడులను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా తిప్పి కొట్టినట్లు తెలిపారు. ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్థాన్ మన దేశంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. సైనిక స్థావరాలు, నివాస ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటుందని భారత సైన్యం ముందుగానే ఊహించిందని తెలిపారు.
ఇందులో స్వర్ణ దేవాలయం అత్యంత ప్రముఖమైనదిగా భావించి అక్కడ పూర్తిస్థాయి వైమానిక రక్షణ కల్పించినట్లు వివరించారు. “ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం గోల్డెన్ టెంపుల్ వంటి మతపరమైన ప్రదేశాలతో సహా భారత పౌర, సైనిక స్థావరాలను పాక్ లక్ష్యం చేసుకుంటుందని భారత సైన్యం ఊహించింది. పాక్ సైన్యానికి ఎటువంటి చట్టబద్ధమైన లక్ష్యాలు లేవని తెలుసు. గోల్డెన్ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకొనే అవకాశాలు కనిపించాయి” అని ఆయన చెప్పారు.
“ముందుగానే ఊహించడంతో స్వర్ణ దేవాలయానికి అదనపు రక్షణ కల్పించాం. మే 8న తెల్లవారుజామున గోల్డెన్ టెంపుల్ లక్ష్యంగా పాక్ డ్రోన్లు, దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించింది. ముందే సిద్ధమై ఉన్న ఇండియన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ పాకిస్థాన్ సైన్యం ప్రణాళికలను తిప్పికొట్టింది. స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేశారు.” అని మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి వెల్లడించారు.
అయితే, “ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదు కొనసాగుతోంది. పాక్ కవ్వింపులకు పాల్పడితే గట్టి ప్రతిస్పందన తప్పదు. పాక్ సైన్యం లోపాలు, ఎదుర్కొన్న ఒత్తిడి గురించి తెలుసు. పాక్ సైన్యం ఏవైనా దాడులకు యత్నిస్తే వినాశకరమైన ప్రతిస్పందనను ఇస్తాం. అవసరమైతే పాకిస్థాన్‌ను పూర్తిగా నాశనం చేస్తాం.” అని కార్తిక్ హెచ్చరించారు. మరోవైపు, పాకిస్థాన్ దాడుల నుంచి తమ ప్రాణాలు కాపాడినందుకు అమృత్ సర్ ప్రజలు ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపారు.
భారత సాయుధ దళాలతో భుజం భుజం కలిపి నిలబడతామని పేర్కొన్నారు. గోల్డెన్ టెంపుల్ సహా సరిహద్దు ప్రాంతాలలోని మతపరమైన ప్రదేశాలను రక్షించడానికి సైన్యం అన్ని ప్రయత్నాలను చేసిందని కొనియాడారు. సాయుధ దళాలకు ప్రజలు తమ సామర్థ్యాల మేరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికుడు ఒకరు తెలిపారు. ఇండియన్ ఆర్మీ స్వర్ణ దేవాలయం, నగరంలోని కొన్ని ప్రాంతాలను రక్షించిందని కృతజ్ఞతలు తెలిపారు.
More Stories
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఏకాకిగా ఇరాన్
స్విస్ బ్యాంకుల్లో 18 శాతం తగ్గిన భారతీయుల డిపాజిట్లు