మీర్‌చౌక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది మృతి

మీర్‌చౌక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది మృతి

హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్‌చౌక్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 17 మంది దుర్మరణం చెందారు. గుల్జార్‌హౌస్ సమీపంలోని ఒక భవనంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో  మొత్తం నాలుగు కుంటుంబాల సభ్యులు మంటల్లో చిక్కుకున్నారు. భవనంలో మొత్తం 30 మంది సభ్యులు ఉండగా.. అందులో రెస్క్యూ సిబ్బంది 16 మందిని కాపాడారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో 10 మంది స్పృహ తప్పి అక్కడే పడిపోయారు.

మంటల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో, అపోలో ఆసుపత్రులకు తరలించారు. ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది మృతిచెందారు. భారీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్‌ చేశారు.

బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి 14 అంబులెన్సులు ఘటనా స్థలికి చేరుకున్నాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. చనిపోయిన వారిలో అభిషేక్‌ మోడీ (30), ఆరుషి జైన్‌ (17), హర్షాలి గుప్తా (7), షీతల్‌ జైన్‌ (37), రాజేందర్‌ కుమార్‌ (67), సుమిత్ర (65), మున్నిబాయి (72), ఇరాజ్‌ (2) ఉన్నారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కంప్రెసర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ దుర్ఘటనతో పాతబస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం కారణంగా పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. చార్మినార్ వెళ్లే రహదారులను మూసివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడకు ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్‌లో అగ్నిప్రమాద ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

పాతబస్తీలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని సీఎం వారికి భరోసా ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని దుకాణంలో ఉన్న ఎయిర్ కండీషనర్ కంప్రెసర్ పేలడం వల్లే ఈ దారుణ జరిగిందని అధికారులు ప్రాథమికంగా అగ్నిమాపక శాఖ అధికారులు అంచనాకు వచ్చారు.

దీని కారణంగా విషపూరితమైన వాయువులు, దట్టమైన పొగ, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. బిల్డింగ్లో ఫైర్ ఎగ్జిస్ట్ లేకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందనే అభిప్రాయానికి వచ్చారు.
పైగా ఇంత పెద్ద ఇంటికి ఒక్కటే ఎగ్జిట్ ఉందని.. బయట ద్వారం చాలా విశాలంగా ఉండి లోపల మాత్రం చాలా ఇరుగ్గా ఉందని, మెట్లు కూడా సరిగ్గా లేవని అధికారులు తెలిపారు.