ఏపీతో సహా మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

ఏపీతో సహా మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల్లో మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. మే 1, 2 తేదీల్లో మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రధాని పర్యటించనున్నారు. ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను పీఎం ప్రారంభిస్తారు.  దాదాపు 25 దేశాలకు చెందిన మంత్రుల భాగస్వామ్యంతో గ్లోబల్ మీడియా డైలాగ్‌ సదస్సు జరుగనుంది. 
అలాగే కేరళలోని విజింజం అంతర్జాతీయ డీప్ వాటర్ మల్టీపర్పస్ ఓడరేవును ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో రూ. 58,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని. ఏపీ బహుళ రోడ్డు , రైలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి.. అక్కడ నిర్వహించే బహరింగ సభలో ప్రధాని మోదీ చేయనున్నారు.

ఏపీలో ప్రధాని పర్యటన వివరాలు

మే 2న ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ రాజధాని అమరావతిలో చేపట్టే రూ.49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు పీఎం శంకుస్థాపన చేస్తారు. 

ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ.

  • డీఆర్‌డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఐ, రైల్వేస్‌కు సంబంధించి రూ.57,962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని.
  • నాగాయలంకలో దాదాపు రూ.1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన
  • వైజాగ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్‌కు శంకుస్థాపన
  • రూ.293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజక్టుకు శంకుస్థాపన
  • ఇవి కాకుండా… రూ. 3176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా అమరావతి వేదికగా వర్చ్యువల్ పద్ధతిలో శంకుస్థాపనలు
  • అలాగే రూ.3680 కోట్ల విలవైన పలు నేషనల్ హైవే పనులను ప్రారంభించనున్నారు మోదీ
  • రూ.254 కోట్లతో పూర్తి చేసిన ఖాజీపేట – విజయవాడ 3వ లైన్, గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి, కేయీఎఫ్ పాణ్యం లైన్‌లను ప్రధాని ప్రారంభించనున్నారు.
  • మొత్తం రూ.57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేయనున్నారు ప్రధాని మోదీ