అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వం తాజాగా వారికి ఓ బంపర్ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే స్వచ్ఛందంగా అమెరికా వీడి తమ స్వదేశానికి వెళ్లిపోతారో వారికి విమాన టికెట్లతో పాటూ కొంత ఆర్థిక సాయం కూడా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.
హంతకులను అమెరికా నుంచి బయటికి పంపించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. అమెరికాలోనివలసదారులపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ దేశం విడిచివెళ్లేవారికి విమాన ఛార్జీలు, స్టైఫండ్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా యాంకర్ ట్రంప్‌కు ఓ వీడియో చూపించారు. ఓ వ్యక్తి 20 ఏళ్ల క్రితం చట్టవిరుద్ధంగా అమెరికాకు వచ్చాడని, ప్రస్తుతం అతికి పిల్లలు కూడా ఉన్నారని ఆ వీడియో సారాంశం.
తాను ఓటు వేయలేకపోయినా, తాను ట్రంప్‌కు మద్ధతు ఇచ్చేవాడినని ఆ వ్యక్తి తెలిపారు. ఈ వీడియో చూసిన ట్రంప్ ఇలాంటి వ్యక్తిని తమ దేశంలో ఉంచుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. ఇలాంటి వారి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని కూడా చెప్పారు. వలసదారులను దేశం నుంచి పంపించడమే తమ ప్రథమ లక్ష్యమని, అయితే వారు ఉండడానికి అర్హులని తేలితే తిరిగి వెనక్కి తీసుకురావడానికి కూడా అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు.
స్వీయ బహిష్కరణకు తుది ఉత్తర్వులు పొంది కూడా 30 రోజులు దాటి అమెరికాలో నివసిస్తున్న వారికి రోజుకు 998 డాలర్లు జరిమానాగా విధిస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటూ, నేరాలకు పాల్పడుతున్న వారిపై ఇమిగ్రేషన్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇలా చట్టవిరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయ బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
మరోవంక, విద్యా సంవత్సరం మధ్యలో తమను దేశం నుంచి వెళ్లగొడుతూ ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఆకస్మిక ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమెరికా వ్యాప్తంగా పలు ఫెడరల్ కోర్టులలో పలువురు విదేశీ విద్యార్థులు కేసులు దాఖలు చేశారు. తమను అన్యాయంగా టార్గెట్ చేసి దేశం నుంచి వెళ్లగొడుతున్నారని, ఎలాంటి న్యాయపరమైన ప్రక్రియ పాటించకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ తమ వీసాలను రద్దు చేసిందని, దీని కారణంగా వందలాది మంది విద్యార్థులు దేశ బహిష్కరణ శిక్షను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.
కాగా, హార్వర్డ్ వర్సిటీకి నిధుల స్తంభన క్యాంపస్‌లో విద్యార్థుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ డిమాండ్లను తిరస్కరించినందుకు హార్వర్డ్ యూనివర్సిటీకి 220 కోట్ల డాలర్ల (రూ. 18,864 కోట్లు) గ్రాంట్లు, కాంట్రాక్టులను స్తంభింపచేస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. పన్ను మినహాయింపు ప్రతిపత్తిని తొలగిస్తామని కూడా హెచ్చరించింది.
రాజకీయ సంస్థగా గుర్తిస్తూ పన్నులు విధిస్తామని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ మంగళవారం హార్వర్డ్ యూనివర్సిటీని హెచ్చరించారు. గత శుక్రవారం యూనివర్సిటీకి రాసిన లేఖలో పాలన, నాయకత్వ సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం డిమాండు చేసింది. కాగా, ప్రభుత్వ డిమాండ్లను హార్వర్డ్ ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ తోసిపుచ్చారు. ప్రభుత్వ ఆదేశాల్ని ఆయన తప్పుపట్టారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు
పహల్గాం దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి