ఎస్‌బీఐ రుణాల రేటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు

ఎస్‌బీఐ రుణాల రేటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు
 
ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రుణాల రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకు నుంచి వారికి సైతం భారం స్వల్పంగా తగ్గనున్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల రేపోరేటును తగ్గించడంతో ఎస్‌బీఐ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 25 బేసిస్ పాయింట్లు తగ్గి 8.25 శాతానికి చేరుకుంది. 
 
ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు (ఈబీఎల్‌ఆర్)ను 8.65 శాతానికి ఎస్‌బీఐ తగ్గించింది. సవరించిన రేట్లు ఈ నెల 15 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. ఎస్‌బీఐ డిపాజిట్ రేట్లను కూడా 10-25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏప్రిల్‌ 15 నుంచి అమలులోకి రానున్నాయి. 
 
రూ.3 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం, 1-2 సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గించగా 6.70 శాతానికి చేరనున్నది. 2 నుంచి మూడేళ్ల మెచ్యూరిటీ వ్యవధి ఉన్న డిపాజిట్లపై 7 శాతానికి బదులుగా 6.90 శాతం వడ్డీ చెల్లించనున్నది. రూ.3 కోట్ల కంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో.. 180 రోజుల నుంచి 210 రోజుల మెచ్యూరిటీ వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40 శాతానికి చేర్చింది.

211 రోజుల నుంచి ఏడాది లోపు మెచ్యూరిటీ వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.50 శాతానికి చేరనున్నది. అలాగే ఒకటి నుంచి రెండేళ్ల కొత్త వడ్డీ రేటు ఇప్పుడు 7 శాతం నుండి 6.80 శాతంగా తగ్గనున్నది. మరోవైపు, 2-3 సంవత్సరాలకు కొత్త వడ్డీ రేటు 7 శాతం నుండి 6.75 శాతంగా ఉంటుంది.  అమృత్‌ వృష్టిలో సాధారణ పౌరులకు 7.05శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.55శాతం వడ్డీ చెల్లించనున్నది. అదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సైతం సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.75 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇతర ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ఇతే అత్యల్పం. 

రూ.50 లక్షలకు కంటే ఎక్కువ ఉండే నిల్వలపై వడ్డీ 3.25 శాతం చెల్లించనుంది. తగ్గించిన వడ్డీ రేట్లు ఈ నెల 12 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7.3శాతం వడ్డీని అందించే 400 రోజుల ప్రత్యేక డిపాజిట్‌ స్కీమ్‌ని ఉపసంహరించుకుంది. ముంబయికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గృహ రుణ వడ్డీ రేట్లలో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో కొత్త, ప్రస్తుత కస్టమర్లకు సైతం ప్రయోజనం ఉంటుందని తెలిపింది.