కరోనా ప్రభావం తగ్గిన తర్వాత విమాన ప్రయాణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యధిక రద్దీ గల విమానాశ్రయాల జాబితాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. ఇందులో ఢిల్లీకి చెందిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టాప్ 10లో చోటు దక్కించుకోవడం గమనార్హం. అమెరికాలోని హర్డ్స్ ఫీల్డ్- జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం (ఎటిఎల్) మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
2024లో 108.1 మిలియన్ల ప్రయాణికులకు ఈ విమానాశ్రయం సేవలందించింది. 2023తో పోలిస్తే ఇది 3.3 శాతం అధికం అయినా, కరోనా ముందు స్థాయితో పోలిస్తే మాత్రం ఇంకా 2 శాతం తక్కువగానే ఉంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (డి ఎక్స్ బి) వరుసగా రెండోసారి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. 92.3 మిలియన్ల ప్రయాణికులతో 6.1 శాతం వృద్ధిని సాధించింది. యూరప్, ఆసియా, ఆఫ్రికాల మధ్య ఉన్న మెరుగైన కనెక్టివిటీ దీనికి ప్రధాన కారణం.
ఆసియాలో అత్యధిక రద్దీ గల టోక్యో హనేడా ఎయిర్‌పోర్ట్ (హెచ్ ఎన్ డి) 85.9 మిలియన్ల ప్రయాణికులతో నాలుగో స్థానంలో నిలిచింది. డల్లాస్ ఫోర్ట్ వర్త్ (డి ఎఫ్ డబ్ల్యు) 87.8 మిలియన్ల ప్రయాణికులతో మూడో స్థానం దక్కించుకుంది. ఇది 2019 స్థాయిల కంటే 17 శాతం ఎక్కువ. లండన్ హీత్రో (ఎల్ హెచ్ ఆర్) ఐదవ స్థానంలో నిలిచింది. డెన్వర్ ఎయిర్‌పోర్ట్ (డిఇయెన్) ఆరో స్థానంలో ఉండగా, ప్రయాణికుల సంఖ్య 82.4 మిలియన్లు.
టర్కీకి చెందిన ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ (ఐ ఎస్ టి) 80.1 మిలియన్ల ప్రయాణికులతో ఏడో స్థానంలో ఉంది. తర్వాతగా చికాగో ఓ’హేర్ (ఓ ఆర్ డి) 80 మిలియన్ల ప్రయాణికులతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇవన్నీ 2019తో పోలిస్తే గణనీయమైన వృద్ధిని చూపుతున్నాయి.
భారతదేశం నుంచి ఢిల్లీకి చెందిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకుంది. 2024లో 77.8 మిలియన్ల ప్రయాణికులతో 7.8 శాతం వృద్ధి నమోదు చేసింది. దేశీయ విమానాల్లో వేగంగా పెరుగుతున్న డిమాండ్, అంతర్జాతీయ మార్గాల విస్తరణ దీనికి సహాయంగా నిలిచాయి. ఇది దక్షిణాసియాలో ఓ ప్రధాన కేంద్రంగా మారుతోంది.
చైనాలోని షాంఘై పుడాంగ్ విమానాశ్రయం 2023లో 21వ స్థానంలో ఉండగా, 2024లో 76.8 మిలియన్ల ప్రయాణికులతో పదో స్థానానికి దూసుకొచ్చింది. ఏకంగా 41 శాతం వృద్ధిని నమోదు చేయడం నిజంగా అద్భుతం.
More Stories
ట్రంప్ టారిఫ్లను నిలిపివేయాలని కోర్టుకు 12 రాష్ట్రాలు
అమెజాన్, వాల్మార్ట్లపై ఆంక్షలు తొలగింపుకై వత్తిడి
జులైలో పట్టాలపైకి దేశంలో తొలి హైడ్రోజన్ రైలు