బెల్జియంలో మెహుల్‌ చోక్సీ అరెస్ట్‌

బెల్జియంలో మెహుల్‌ చోక్సీ అరెస్ట్‌
దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌ అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రుణ మోసం కేసులో వేల కోట్ల మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వజ్రాల వ్యాపారం పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు కు మొహుల్ చోక్సీ వేల కోట్లు ఎగవేత కేసు లో కొన్నేళ్లుగా అరెస్ట్ కు ప్రయత్నాలు సాగుతున్నాయి. విచారణ ఎదుర్కొంటున్న మొహుల్ చోక్సీ అరెస్ట్ విదేశాల్లో ఆశ్రయం పొందారు. విచారణ సంస్థలు ఆయన్ను భారత్ కు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేసాయి.
 
పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు రూ. 13వేల కోట్లు మోసం చేసి భారతదేశాన్ని విడిచిపెట్టి బెల్జియం పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీను రప్పించడానికి విచారణ సంస్థలు అనేక ప్రయత్నాలు చేసాయి. అయితే, విచారణ సంస్థల అడుగులను పసి గడుతూ విదేశాల్లోనే ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చోక్సీ తప్పించుకునే ప్రయత్నం చేసారు. అంటిగ్వా, బార్బుడాలోనే పట్టుకునే ప్రయత్నం చేసినా చిక్కకుండా పారిపోయారు. పంజాబ్ నేషన ల్ బ్యాంకుతో పాటుగా పలు బ్యాంకులకు టోకరా పెట్టినట్లు చోక్సీ పైన ఆరోపణలు ఉన్నాయి.
 
చోక్సీ అరెస్ట్‌ భారత్‌కు పెద్ద విజయం అని కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి వ్యాఖ్యానించారు. పేదల సొమ్ము దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకొస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. “విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకొస్తామని ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. పేదల డబ్బును దోచుకున్న వారు ఆ సొమ్మును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. దేశంలో చాలా మందిపై చర్యలు తీసుకుంటున్నాం. మెహుల్ చోక్సీని అరెస్టు చేశారు. ఇది భారత్‌కు పెద్ద విజయం”  అని ఆయన చెప్పారు.
కాగా, తాజాగా భారత్ అభ్యర్ధన మేరకు బెల్జియం లో మొహుల్ చోక్సీ అరెస్ట్ చేసారు. భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సీబీఐ విజ్ఞప్తి మేరకు ఆయనను శనివారం అరెస్టు చేసినట్లు పలు మీడియా నివేదికలు తెలిపాయి.  ఆయన బెల్జియం జైలులో ఉన్నట్లు సమాచారం. ముంబయి కోర్టు జారీ చేసిన రెండు అరెస్టు వారెంట్ల ఆధారంగా అరెస్టు చేసినట్లు సమాచారం.
2018 మే 23న తొలిసారి 2021 జూన్‌ 15న రెండోసారి వారెంట్లు జారీ అయ్యాయి. అయితే, మెహుల్‌ చోక్సీ ఆరోగ్యం సరిగా లేదని, దాంతో ఆయనను ఎక్కువ రోజులు జైలులో ఉండే అవకాశం లేదని, కోర్టు బెయిల్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.  ప్రస్తుతం ఆయన భార్య ప్రీతి చోక్సీతో కలిసి బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం సైతం ఉంది. వైద్య చికిత్సల కోసం ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ సైతం ఈ కేసులో నిందితుడు. ఆయన లండన్‌లో ఉండగా భారత్‌కు రప్పించే ప్రక్రియ కొనసాగుతున్నది. దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌ అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జరిగిన కుంభకోణం వెలుగులోకి రావడానికి కొన్ని వారాల ముందు జనవరి 2018లో భారత్‌ నుంచి పారిపోయారు. అయితే, మెహుల్‌ చోక్సీ, నీరవ్‌ మోదీని భారత్‌కు రప్పించేందుకు సీబీఐతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.