“ఓటు బ్యాంకు వైరస్”తో వక్ఫ్ చట్టంకు కాంగ్రెస్ వ్యతిరేకత 

“ఓటు బ్యాంకు వైరస్”తో వక్ఫ్ చట్టంకు కాంగ్రెస్ వ్యతిరేకత 
వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ “ఓటు బ్యాంకు వైరస్”ను వ్యాప్తి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ రూల్స్​ను తమ స్వార్థానికి మార్చేసిందని పేర్కొంటూ  ఎస్సీ, ఎస్టీ వాళ్లను కాంగ్రెస్ రెండో తరగతి పౌరులుగా చూస్తోందని మోదీ ఆరోపించారు. హరియాణాలో పర్యటించిన మోదీ సోమవారం హిసార్‌ విమానాశ్రయం నుంచి అయోధ్యకు తొలి వాణిజ్య విమానాన్ని ప్రారంభించారు. 

హిసార్ ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్,ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ “వక్ఫ్ పేరుతో భారత్‌లో లక్షల హెక్టార్ల భూమి ఉంది. వక్ఫ్ ఆస్తుల నుంచి ప్రయోజనాలను పేదలకు, ఇంకా అవసరమైన వారికి ఇచ్చి ఉంటే అది వారికి ప్రయోజనం చేకూర్చేది. కానీ ఈ ఆస్తుల నుంచి భూ మాఫియా మాత్రమే ప్రయోజనం పొందుతోంది” అని విమర్శించారు.

“ముస్లీం నవతరం సైకిళ్లకు పంక్చర్లు వేసుకుని బతకాల్సిన పనిలేదు. ఆ మాఫియా ఎవరి భూమిని దోపిడి చేస్తోంది? నిజానికి అనేకమంది ముస్లీం మహిళలు భారత ప్రభుత్వానికి లేఖలు రాసిన తర్వాతే ఈ వక్ఫ్‌ గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సవరించిన వక్ఫ్ చట్టంతో పేదల దోపిడి ఆగిపోతుంది” అని ప్రధాని భరోసా ఇచ్చారు. కొత్త వక్ఫ్ చట్టం ప్రకారం ఏ ఆదివాసీకి చెందిన భూమిపై లేదా ఆస్తిపై వక్ఫ్ బోర్డు చేయి వేయలేదని ప్రధాని స్పష్టం చేశారు. 

పేద ముస్లీంలు, పస్మాండ ముస్లీంలు, ముస్లీం మహిళలు, ముస్లీం వితంతు మహిళలు, ముస్లీం పిల్లలు వారి హక్కులను పొందుతారని పేర్కొంటూ ఇదే నిజమైన `సామాజిక న్యాయం’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని నాశనం చేసే పార్టీగా మారిందని ప్రధాని ఆరోపించారు. “డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమానత్వాన్ని తీసుకురావాలని, ప్రతి పేదవాడు గౌరవంగా తల ఎత్తుకుని జీవించాలని కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్​ను వ్యాప్తి చేసింది. పేదవాడి కలలను అడ్డుకుంది. కాంగ్రెస్ కాలంలో ఎస్​సీ, ఎస్​టీ ఓబీసీలకు బ్యాంకులు తలుపులు కూడా తెరవలేదు” అని ప్రధాని ధ్వజమెత్తారు. 

“అప్పులు, సంక్షేమ పథకాలు అన్నీ కలగానే ఉండేవి. కానీ ఇప్పుడు జన్​ ధన్​ ఖాతాల్లో అత్యధిక లబ్ధిదారులు వాళ్లే ఉన్నారు. అంబేద్కర్​ బ్రతికి ఉన్నప్పుడు ఆయనను అవమానించింది. రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోయేలా చేసింది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ చేసినది మర్చిపోకూడదు” అని మోదీ తెలిపారు. కాంగ్రెస్ అంబేద్కర్ దార్శనికతకు ద్రోహం చేసిందని , షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలను “రెండవ తరగతి పౌరులు”గా చూస్తోందని కూడా ప్రధాని మోదీ ఆరోపించారు