కొత్త వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్‌లో హింస వెనుక బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు కేంద్ర అత్యున్నత నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో బెంగాల్‌లో దాడులు చేసిన చరిత్ర జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్‌కు(జేఎమ్‌బీ) ఉంది. ప్రస్తుతం ఆ సంస్థ తిరిగి బెంగాల్‌పై పట్టు బిగిస్తున్నదని, ఏడు సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నదని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ముఖ్యంగా ఆ జిల్లాల్లోని మదర్సాల నుంచి యువకులను భారీగా జేఎమ్‌బీ నియమించుకుంటోందని చెబుతున్నాయి. ముర్షిదాబాద్, 24 పరగణాల జిల్లాల్లో మొదలైన అల్లర్ల వెనుక ఉన్నది ఈ సంస్థయేనని అంటున్నాయి. 2019లో జరిగిన సిఎఎ వ్యతిరేక అల్లర్లలో అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడు కూడా అనుసరిస్తున్నట్లు భావిస్తున్నారు. దీనివల్ల బెంగాల్ తీవ్రమైన శాంతిభద్రతల సమస్యను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇస్లామిక్ ఎజెండా కింద తాజాగా వక్ఫ్ ఆందోళనలను రగుల్చుతున్నదనే భయాందోళనలను నిఘా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.
కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో ఆదివారం బిఎస్‌ఎఫ్ కు చెందిన 8 కంపెనీల జవాన్లు, వెయ్యిమంది పోలీసులను మోహరించారు. ముషీరాబాద్ జిల్లాలో నిషేధాజ్ఞలు, ఇంటర్ నెట్ పై నిషేధం విధించారు. ఇప్పటివరకు 150 మందిని అరెస్టు చేశారు. డీజీ స్థాయి నుంచి అదనపు ఎస్పీ స్థాయి వరకు కీలక పోలీసు అధికారులు పరిస్థితులను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నిఘా సంస్థలు అత్యవసర హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, శాంతిభద్రతలు వ్యవస్థాగతంగా కుప్పకూలిపోతున్నాయని ఆరోపణలు వెలువడుతున్నాయి. రాష్ట్ర పోలీసులు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)తో కుమ్మక్కై మత ఘర్షణలను పట్టించుకోలేదని ఆ వర్గాలు ఆరోపించాయి.“నిరసనల సమయంలో హిందూ ఆస్తులపై దాడులు జరిగాయి. మతపరమైన భావాలను రాజకీయంగా దోపిడీ చేయడం వల్ల బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న రాష్ట్రం అస్థిరతకు గురవుతోంది” అని వర్గాలు ఆరోపించాయి.
పోలీసులు “కనీస బలప్రయోగం” మాత్రమే ఉపయోగిస్తున్నట్లు అంగీకరించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా చర్య తీసుకోలేదనే ఆరోపణలకు ఆజ్యం పోశారు.చివరికి, కలకత్తా హైకోర్టు జోక్యం చేసుకుని ముర్షిదాబాద్‌లోనే కాకుండా, ఇటువంటి హింసాత్మక సంఘటనలు జరిగే ఇతర ప్రదేశాలలో కూడా కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది.
కాగా, హింసాత్మక ప్రాంతాల్లో కఠినమైన శాంతిభద్రతలను కాపాడుతామని గవర్నర్ సివి ఆనంద బోస్ ఆదివారం హామీ ఇచ్చారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరూ అనుమతించబడరని హెచ్చరించారు. రాజ్ భవన్ కోర్ గ్రూప్ ముర్షిదాబాద్, ఇతర హింసాత్మక ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని నిజ సమయంలో పర్యవేక్షిస్తోందని గవర్నర్ బోస్ తెలిపారు.
“రాజ్ భవన్ యొక్క కోర్ గ్రూప్ ముర్షిదాబాద్, ఇతర హింసాత్మక ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని నిజ సమయంలో పర్యవేక్షిస్తోంది. గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య చర్చలు జరిగాయి. భారత ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పరిస్థితిని శ్రద్ధగా, సమర్థవంతంగా గమనిస్తోంది. బిఎస్ఎఫ్, స్థానిక పోలీసులతో సహా చట్ట అమలు అధికారుల నుండి పరిస్థితుల నివేదికలను సేకరించారు” అని బోస్ చెప్పారు.
ఇదిలాఉండగా, అల్లర్ల తర్వాత దాదాపు 400 మంది హిందువులు ముర్షిదాబాద్, ధూలియన్ తదితర ప్రాంతాలను వదిలిపెట్టి భగీరథి నదిని దాటి పొరుగు జిల్లా మాల్దాకు పారిపోయినట్టు బెంగాల్ బీజేపీ శాసనసభ పక్ష నేత సువేందు అధికారి తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల కోసం కావాలనే బెంగాల్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదం విస్తరించడానికి అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మరోవంక, అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలను సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం కింద కల్లోలిత ఏరియాలుగా ప్రకటించాలంటూ కేంద్రానికి బీజేపీ ఎంపీ జ్యోతిర్మయి సింగ్ లేఖ రాశారు. 30 శాతం ముస్లిం ఓటర్లు ఉండటం, 2026 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీలు ఆమె ఓటు బ్యాంకును ఏకీకృతం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత