85 వేల మంది భారతీయులకు చైనా వీసాలు

85 వేల మంది భారతీయులకు చైనా వీసాలు
భారత్‌కు చైనా స్నేహ హస్తం అందిస్తోంది. విదేశీ పర్యటకులను ఆకట్టుకునేలా, ముఖ్యంగా భారత పౌరుల ప్రయాణాన్ని సులభతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్‌ 9 వరకు 85వేల వీసాలు జారీ చేసినట్లు మనదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్‌ వెల్లడించారు.
 
”భారత్‌లోని చైనా ఎంబసీ, కాన్సులేట్లు ఈ ఏడాది ఏప్రిల్‌ 9 వరకు భారతీయులకు 85వేలకుపైగా వీసాలు జారీ చేశాయి. చైనాను సందర్శించడానికి మరింతమంది భారత స్నేహితులకు స్వాగతం. సురక్షిత, స్నేహపూర్వక, స్ఫూర్తివంతమైన చైనాను ఆన్వేషించండి” అని ఫీహాంగ్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.
 
మార్చిలో కూడా ఆయన ఈ తరహా పోస్టు చేశారు. అప్పటికే 50వేల వీసాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వీసా ధరలపై తగ్గింపును చైనా మరో ఏడాది పొడిగించిన సంగతి తెలిసిందే. 2025 డిసెంబరు 31 వరకు వీసా ఫీజుల తగ్గింపు కొనసాగుతుందని వెల్లడించింది. చైనాను గతేడాది వీసా ధరలను తగ్గించింది. 
 
అప్పటినుంచి సింగిల్‌ ఎంట్రీ వీసాలకు రూ.2,900, డబుల్‌ ఎంట్రీ వీసాలకు రూ.4,400 వసూలుచేస్తున్నారు. ఆరు నెలల గడువు ఉండే మల్టిపుల్‌ ఎంట్రీ వీసాకు రూ.5900, సంవత్సరం, అంతకంటే పైబడి గడువు ఉండే మల్టీ ఎంట్రీ వీసా రూ.8,800 చెల్లించాల్సి ఉంటుంది.  గత అక్టోబర్‌ నుంచి చైనా నుంచి సానుకూల వైఖరి కనిపిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించుకోవడం కోసం భారత్‌, చైనా ఆ నెలలోనే కీలక గస్తీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.