2030 నాటికి ఎఐతో డేటా సెంటర్లు విద్యుత్‌ వినియోగం రెట్టింపు

2030 నాటికి ఎఐతో డేటా సెంటర్లు విద్యుత్‌ వినియోగం రెట్టింపు
కృత్రిమ మేథస్సు (ఎఐ)తో 2030 నాటికి డేటా సెంటర్లు విద్యుత్‌ వినియోగం రెట్టింపు కానుంది. ఎఐ వినియోగంతో ఇంధన భద్రత, కార్బన్‌డయాక్సైడ్‌ ఉద్గారాల లక్ష్యాలకు కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎఐ ఇంధన ప్రభావాలపై అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ) గురువారం తన మొదటి నివేదికను విడుదల చేసింది. 2030 నాటికి డేటా సెంటర్లు ప్రపంచ ఇంధనంలో సుమారు 3 శాతం వినియోగిస్తాయని నివేదిక తెలిపింది.

డేటా సెంటర్‌ విద్యుత్‌ వినియోగం 2030 నాటికి సుమారు 945 టెరావాట్‌ అవర్స్‌ (టిడబ్ల్యుహెచ్‌)కి చేరుకుంటుంది. ఇది ప్రస్తుత జపాన్‌ విద్యుత్‌ వినియోగం కంటే కొంచెం ఎక్కువే. ఇతర డిజిటల్‌ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ఈ వృద్ధికి ఎఐ అత్యంత ముఖ్యమైన చోదకశక్తిగా మారనుందని నివేదిక పేర్కొంది.

గతేడాది ప్రపంచ విద్యుత్‌ వినియోగంలో డేటా సెంటర్లు సుమారు 1.5శాతం ప్రాతినిధ్యం వహించాయి. గత ఐదేళ్లలో ఏడాది 12 శాతం పెరుగుతోంది. ప్రస్తుతం చైనా, యూరప్‌, అమెరికా దేశాలు కలిసి డేటా సెంటర్‌ వినియోగంలో సుమారు 85 శాతం వాటా కలిగి ఉన్నాయి.

అదే సమయంలో, విద్యుత్తును మరింత సమర్థవంతంగా ఉత్పత్తి చేయడానికి, వినియోగించేందుకు ఎఐ అవకాశాలను కల్పిస్తుందని ఐఇఎ పేర్కొంది. పెద్ద టెక్‌ కంపెనీలు తమ పెరుగుతున్న విద్యుత్‌ అవసరాన్ని మరింతగా గుర్తిస్తున్నాయని తెలిపింది. అణురియాక్టర్ల నుండి విద్యుత్‌ను సేకరించేందుకు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వంటి సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి.

డేటా సెంటర్ల పెరుగుదల కార్బన్‌డయాక్సైడ్‌ ఉద్గారాలను కూడా పెంచుతోంది. ప్రస్తుతం 180 మిలియన టన్నుల సిఒ2 నుండి 2035 నాటికి 300 మిలియన్‌ టన్నులకు చేరుకుంటుందని ఐఇఎ తెలిపింది. 2024లో అంచనా వేయబడిన 41.6బిలియన్‌ టన్నుల ప్రపంచ ఉద్గారాలలో ఇది కనీస వాటాగా ఉంటుందని పేర్కొంది.