మొబైల్ నెట్వ‌ర్క్ క‌వ‌రేజీ మ్యాప్‌లు

మొబైల్ నెట్వ‌ర్క్ క‌వ‌రేజీ మ్యాప్‌లు
టెలికాం స‌ర్వీస్ సంస్థ‌లు తమ వెబ్‌సైట్ల‌లో మొబైల్ నెట్వ‌ర్క్ క‌వ‌రేజీ మ్యాప్‌ ల‌ను ప్ర‌చురించాయి. ట్రాయ్ ఆదేశాల ప్ర‌కారం ఆ మ్యాప్‌ను ప‌బ్లిష్ చేశారు. ట్రాయ్ వెబ్‌సైట్‌లో కూడా ఆ మ్యాప్ లింకులున్నాయి. మొబైల్ యూజ‌ర్ల‌ను బ‌లోపేతం చేయ‌డానికి, పార‌ద‌ర్శ‌క‌త కోసం మ్యాప్‌ల‌ను రిలీజ్ చేసిన‌ట్లు టెలికాం సంస్థ‌లు పేర్కొన్నాయి. 
 
వైర్‌లెస్ సేవ‌లు అందించే సంస్థ‌లు జియోస్పేసియ‌ల్ లొకేష‌న్ గురించి ఆ మ్యాప్‌లో పేర్కొన్నాయి. క‌స్ట‌మ‌ర్ త‌మ లొకేష‌న్‌లో ఉండే సేవ‌ల గురించి ఆ మ్యాప్‌ల ద్వారా సంపూర్ణంగా తెలుసుకోవ‌చ్చు. ట్రాయ్ నిబంధ‌న‌లు, ఆదేశాల ప్ర‌కారం ఏప్రిల్ ఒక‌టో తేదీ లోగా మ్యాప్‌ల‌ను వివిధ కంపెనీలు త‌మ వెబ్‌సైట్ల‌లో క‌వ‌రేజ్ మ్యాప్‌ల‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంది.

భారతి ఎయిర్‌టెల్‌, రిల‌య‌న్స్ జియో, వోడాఫోన్ సంస్థ‌లు ఇప్ప‌టికే మొబైల్ నెట్వ‌ర్క్ క‌వ‌రేజీ మ్యాప్‌ల‌ను త‌మ వెబ్‌సైట్ల‌లో ప్ర‌చురించాయి. అయితే బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మాత్రం ఇంకా ఆ క‌వ‌రేజ్ మ్యాప్ లింక్‌ల‌ను రిలీజ్ చేయ‌లేదు. అన్ని కంపెనీల‌కు చెందిన లింక్‌ల‌ను ట్రాయ్ వెబ్‌సైట్‌లో కూడా పోస్టు చేశారు. 

క‌వ‌రేజీ మ్యాప్‌ల్లో యూజ‌ర్ ఫ్రెండ్లీ ఫీచ‌ర్లు ఉన్న‌ట్లు ట్రాయ్ తెలిపింది. మ‌న ఏరియాలో ఎక్క‌డ 2జీ, 3జీ, 4జీ, 5జీ టెక్నాల‌జీ అందుబాటులో ఉందో ఆ వెబ్‌సైట‌లో చూసి తెలుసుకోవ‌చ్చు. వివిధ ర‌కాల రంగుల్లో క‌వ‌రేజీ మ్యాప్‌ల‌ను రూపొందించారు. త‌మ లొకేష‌న్‌లో ప్లాన్ మార్చుకోవాల‌నుకున్న వారు.. మ్యాప్ ద్వారా ఆ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంటుంది. మ్యాప్‌ల‌తో క‌స్ట‌మ‌ర్లు త‌మ డేటాను విశ్లేషించుకోవ‌చ్చు.