12న రెట్టింపు స్థాయిలో వీర హనుమాన్ విజయ యాత్ర

12న రెట్టింపు స్థాయిలో వీర హనుమాన్ విజయ యాత్ర
గౌలిగూడ హనుమాన్ మందిర్ నుంచి తాడ్బండ్ హనుమాన్ మందిర్ వరకు ప్రతి సంవత్సరం నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్రను ఈ నెల 12న కూడా రెట్టింపు స్థాయిలో, అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి తెలిపారు. రాజకీయాలు, కులాలకు అతీతంగా హిందూ శక్తి ప్రదర్శన కోసం ప్రతి ఇంటి నుంచి ఒక హిందూ కార్యకర్త తరలిరావాలని పిలుపునిచ్చారు.
 
రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములులతో కలిసి వీర హనుమాన్ విజయ యాత్ర (హనుమాన్ జయంతి) గోడపత్రికలను నాయకులు ఆవిష్కరించారు. కులాలకు, ప్రాంతాలకు అతీతంగా హిందువులందరూ సంఘటితం కావాలని, పేద , ధనిక తారతమ్యాలకు తావు లేకుండా ప్రతి హిందువు ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు. 
 
కొన్ని రాజకీయ పార్టీలు హిందువులను విభజించి పాలించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. రాజకీయాలకు తావు లేకుండా హిందువులంతా ఏకమైతేనే మనుగడ సాధ్యమని, లేదంటే రాబోవు రోజుల్లో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. విడిపోతే పడిపోతామని “బటేగాతో కటేగా” అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని చెప్పారు. 
 
” ఏక్ హై తో సేఫ్ హై” సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధించగలం అనే నినాదాన్ని అనుసరించాలని పేర్కొన్నారు. కాగా, వక్ఫ్ పేరుతో దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కొంతమంది పనిగట్టుకొని ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటూ అటువంటి సంఘవిద్రోహ శక్తుల విషయంలో హిందూ సమాజం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 
 
తమది కానీ ఆస్తిని తాము సొంతం చేసుకునేందుకు అడ్డదారిలో తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డును నిషేధించాలని నరసింహమూర్తి డిమాండ్ చేశారు. విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులు, సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ
వక్ఫ్ విషయంలో అవగాహన పెంచుకోవాలని కోరారు. 
 
ఈరోజు పార్లమెంటు భవనంతో సహా, వేల సంవత్సరాల క్రితం నాటి ద్వాపర శ్రీకృష్ణ మందిరం కూడా తమదే అంటూ వక్ఫ్ బోర్డ్ ఆక్రమించుకునేందుకు కుట్రలు చేస్తుందనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పారు. మనకెందుకులే అంటూ చూస్తూ ఊరుకుంటే రేపు మనం ఉండే ఇల్లు కూడా  వక్ఫ్ ఆస్తి అని, ఇది ఖాళీ చేయండి అంటూ నోటీసులు ఇస్తారని హెచ్చరించారు. 
 
రాజకీయ స్వార్థానికి సాక్ష్యంగా నిలిచిన  వక్ఫ్ బోర్డు పరిమితులు విస్తృతంగా పెంచారని, చట్టబిరుద్ధంగా రాజ్యాంగ  విరుద్ధంగా, అనేకమైన హక్కులను కల్పిస్తూ 2013లో అప్పటి ప్రభుత్వం దేశానికి తీరని ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. కాబట్టి హిందూ సమాజమంతా సంఘటితమై ఆలోచిస్తేనే క్షేమంగా ఉంటామని, లేదంటే తీవ్ర ఇబ్బందులు తప్పవని  వారు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈరోజు భాగ్యనగర్ కేంద్రంగా ప్రారంభమైన వీర హనుమాన్ విజయ యాత్ర లు రాష్ట్రంలోని ప్రతి జిల్లా.. ప్రతి మండలం.. పల్లె.. తండాల వరకు వ్యాపించిందని ఆనందం వ్యక్తం చేశారు. హిందువులందరికీ బజరంగ్ అండగా ఉంటుందని భరోసా కల్పించేందుకే కాషాయ జెండాలతో శ్రీరామ నామ జపంతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు నాయకులు చెప్పారు.