రామాయణ గాథలు థాయ్ ప్రజల జీవితాల్లో భాగం

రామాయణ గాథలు థాయ్ ప్రజల జీవితాల్లో భాగం

“భారత్‌- థాయ్‌లాండ్ మధ్య శతాబ్దాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. సాంస్కృతక, ఆధ్యాత్మిక సంబంధాలతో బలమైన బంధం ఏర్పడింది. బౌద్ధమతం వ్యాప్తి మన ప్రజలను అనుసంధానించింది. అయుతయ నుంచి నలంద వరకు మేధావులు రాకపోకలు సాగించారు. రామాయణ గాథలు థాయ్ ప్రజల జీవితాల్లో ఒక భాగమయ్యాయి. సంస్కృతం, పాళీ భాషల ప్రభావం నేటికీ ఇరువురి సంప్రదాయాల్లో ప్రతిబింబిస్తుంది” అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 

బిమ్స్‌టెక్ సదస్సులో భాగంగా థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని థాయ్ ప్రజల జీవితాల్లో రామాయణ ఇతిహాసం లోని గాథలు భాగమని తెలిపారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలకు చెందిన 7 దేశాల సమాగమం అయిన బంగాళాఖాత ప్రాంత బహుళ రంగ, సాంకేతిక, ఆర్థిక సహకార (బిమ్‌స్టెక్) సదస్సు కోసం రెండు రోజుల పాటు గురువారం మోదీ  థాయ్‌లాండ్‌కు వెళ్లారు.

ప్రధానుల భేటీ తర్వాత మోదీ మాట్లాడుతూ “నా పర్యటన సందర్భంగా 18వ శతాబ్దపు రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా ఒక స్మారక స్టాంపును విడుదల చేసిన థాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని హర్షం వ్యక్తం చేశారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండోఫసిఫిక్ విజన్‌లో థాయ్‌లాండ్‌ది కీలక పాత్ర అని ప్రధాని చెప్పారు. 

తమ రెండు దేశాలు అభివృద్ధి వాదాన్ని సమర్థిస్తాయని, విస్తరణ వాదాన్ని కాదని చైనాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇటీవల సంభవించిన భూకంపంలో మృతి చెందిన వారికి భారత్ తరఫున సంతాపం తెలియజేశారు. 

బిమ్‌స్టెక్ సదస్సులో భారత్‌తోపాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్ దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. బ్యాంకాక్ పర్యటనలో భాగంగా మోదీ పదవ ‘రామ’ గా కూడా ప్రసిద్ధుడైన థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కోమ్‌ను కలుస్తారు.

భారత్‌ అభివృద్ధిని ఆకాంక్షించే వికాసవాదాన్ని నమ్ముతుందే తప్ప, విస్తరణవాదాన్ని కాదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, పారదర్శక, సమ్మిళిత, చట్టబద్ధ వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. థాయ్‌ ప్రధాని పెటోంగ్‌టార్న్‌ షినవత్రతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 

ఆమెతో జరిపిన చర్చల్లో భారత్‌-థాయ్‌లాండ్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు-థాయ్‌లాండ్‌ల మధ్య పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాలు, విద్యా రం గాల్లో సహకారం పెంపొందింపచేసుకోవాలని నిశ్చయించినట్టు తెలిపారు. 

భారత్‌ అమలు చేస్తున్న ‘లుక్‌ ఈస్ట్‌ పాలసీ’, ఇండో-పసిఫిక్‌ విజన్‌లో థాయ్‌లాండ్‌కు ప్రత్యేక స్థానం ఉందని వివరిం చారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చాలని, రెండు దేశాల భద్రత సంస్థల మధ్య వ్యూహాత్మక చర్చలు జరగాలని కూడా నిర్ణయించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు.