ఈ సందర్భంగా ఎంపీ రఘునందర్ రావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు విద్యార్థులు సాధించిన సమైక్య విజయం అని తెలిపారు. విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపినప్పుడు పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో పిల్లల జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు.
“మా నానమ్మ ఇచ్చిన భూములను ఎందుకు లాక్కుంటున్నావని రాహుల్ గాంధీ అడిగారా?. రాహుల్ అడిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. కోర్టులో ఉన్న అంశంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం సరికాదు. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు విద్యార్థులకు అనుకూలం, వారి విజయానికి నిదర్శనం” అని విమర్శించారు.
భవిష్యత్తులో విద్యార్థుల భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా అడ్డుకుంటామని బిజెపి ఎంపీ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. వాల్టా చట్టం ప్రకారం ఇంటి కాంపౌండ్‌లో ఉన్న చెట్టు నరకాలన్నా అనుమతులు తప్పనిసరని ఆయన తెలిపారు.
ఒక్క చెట్టుకే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మూడ్రోజుల్లో 100 ఎకరాల్లో వేల కొద్దీ చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిందని రఘునాధన్ రావు గుర్తు చేశారు. ఈ చట్టాలు, నిబంధనలు అధికారులకు తెలియదని తాను అనుకోవడం లేదని చెబుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నెల రోజుల్లో నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
“విద్యార్థుల పక్షాన నిలబడతాం. వారి పోరాటాన్ని అభినందిస్తూ వారి వెంట ఉంటాం. 1973లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్టినప్పుడు 2374 ఎకరాలను ప్రభుత్వం ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యమని రోజూ చెప్పే రేవంత్ రెడ్డి ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను వ్యాపారం కోసం ఎలా వాడతారు?” అని ప్రశ్నించారు.
చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలను తొలగించి పర్యావరణాన్ని రక్షించేందుకు హైడ్రా తెచ్చానని సీఎం రేవంత్ చెప్పారని పేర్కొంటూ మరిక్కడ వందల ఎకరాల్లో చెట్లను నరికి, వన్య ప్రాణులకు ఇబ్బంది కలిగిస్తుంటే ఎలా?. అని నిలదీశారు. అమ్మ బతికున్నప్పుడు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

More Stories
తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి పోలవరం వివాదం
మోదీ సభకు స్పందన తెలంగాణాలో బీజేపీ ఎదుగుదలకు నిదర్శనం
స్వయంసేవకుల అసాధారణ ప్రవర్తన, ఆచరణతోనే సంఘ్