చారిత్రాత్మక వక్ఫ్ బిల్ కు రాజ్యసభ ఆమోదం

చారిత్రాత్మక వక్ఫ్ బిల్ కు రాజ్యసభ ఆమోదం
చారిత్రాత్మక వక్ఫ్ (సవరణ) బిల్లు 2025కు తీవ్ర చర్చ తర్వాత రాజ్యసభ ఆమోదం తెలిపింది. గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన చర్చ అర్ధరాత్రి దాటినా కూడా కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు ఓటు వేయగా, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటు వేశారని చైర్మన్ జగదీప్ ధంకర్ తెలిపారు. తుది సంఖ్యలను సరిదిద్దాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
 
బిల్లుపై చర్చ 12 గంటలకు పైగా కొనసాగింది. ప్రభుత్వం దీనిని ఏకీకృత వక్ఫ్ నిర్వహణ సాధికారత, సామర్థ్యం , అభివృద్ధి (యుమీద్) బిల్లుగా పేరు మార్చాలని కూడా ప్రతిపాదించింది. దిగువ సభ ముందురోజే బిల్లును ఆమోదించడంతో, ఇది ఇప్పుడు అధికారికంగా పార్లమెంట్ ఆమోదం పొందిన్నట్లయింది. చట్టంగా మారడానికి ముందు భారత రాష్ట్రపతి వద్దకు తుది ఆమోదం కోసం వెళుతుంది.
 
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెడుతూ వక్ఫ్‌ సవరణ బిల్లును చట్టవిరుద్ధమైనదిగా పేర్కొన్న ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లులో ముస్లిమేతరుల ప్రమేయం ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. ముస్లింల హక్కులను హరిస్తామన్న ప్రతిపక్షాల ఆరోపణలనూ ఖండించారు. ముస్లింల్లోని అన్ని తెగల వారి హక్కులను పరిరక్షించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు చెప్పారు. 
 
ఈ బిల్లుతో వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం పెరుగుతుందని స్పష్టం చేశారు. ‘‘బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేముందు మేం రాష్ట్ర ప్రభుత్వాలు, మైనారిటీ కమిషన్లు, వక్ఫ్‌ బోర్డులతో సంప్రదింపులు జరిపాం. బిల్లు పరిశీలనకు జేపీసీని ఏర్పాటు చేశాం. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది’’ అని రిజిజు చెప్పారు. ప్రస్తుతం దేశంలో 8.72 లక్షల వక్ఫ్‌ ఆస్తు లు ఉన్నాయని పేర్కొన్నారు.
 
2006లో 4.9 లక్షల వక్ఫ్‌ ఆస్తు ల ద్వారా రూ.12 వేల కోట్ల ఆదాయం వస్తుందని సచార్‌ కమిటీ అంచనా వేసిందని, అంటే ప్రస్తుతం ఆయా ఆస్తుల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఊహించుకోవచ్చని తెలిపారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తుల నిర్వహణలో లోపాలను, దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకే ఈ సవరణ బిల్లును తెచ్చినట్లు చెప్పారు. 
 
కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని పేర్కొంటూ వక్ఫ్‌ ఆస్తులన్నీ ముస్లింలకు మాత్రమే చెందుతాయని స్పష్టంచేశారు. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా 284 సంస్థలు తమ అభిప్రాయాలను తెలిపాయని, కోటి మందికి పైగా ప్రజలు వినతిపత్రాలు అందించారని వెల్లడించారు. అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే మైనారిటీ వ్యవహారాల శాఖ ఈ సవరణ బిల్లును రూపొందించిందని రిజిజు స్పష్టం చేశారు. 
సభ్యులందరూ బిల్లుకు మద్దతు తెలుపుతారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ సభ్యుడు సయ్యద్‌ నజీర్‌ మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొట్టి, మతపరమైన ఏకీకరణ కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అబద్ధాల ఆధారంగా సవరణ బిల్లును రూపొందించారని, ఆరు నెలలుగా బీజేపీ వక్ఫ్‌ బిల్లుపై దుష్ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు.

కేంద్రంలో చాలా కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ దేశంలోని ముస్లిం మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేసిందని బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభాపక్ష నేత జేపీ నడ్డా ఆరోపించారు.  ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించడం ద్వారా మోదీ సర్కారు ముస్లిం మహిళలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చిందని చెప్పారు.  ఈజిప్టు, సూడాన్‌, బంగ్లాదేశ్‌, సిరియా వంటి ముస్లిం దేశాల్లో చాలా ఏళ్ల కిందటే ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించగ, భారత్‌లో మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. వక్ఫ్‌ ఆస్తులను ప్రభుత్వం ఏమీ తీసుకోదని, వాటి దుర్వినియోగాన్ని మాత్రమే అడ్డుకుంటుందని చెప్పారు. 

కాగా, కాంగ్రెస్‌ ఎంపీ సర్ఫరాజ్‌ అహ్మద్‌, శివసేన (ఉద్ధవ్‌ వర్గం) ఎంపీ సంజయ్‌ రౌత్‌ వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకించారు. ట్రంప్‌ వేస్తున్న ప్రతీకార సుంకాల నుంచి దృష్టి మరల్చేందుకే మోదీ సర్కారు వక్ఫ్‌ బిల్లు తీసుకొచ్చిందని, అందుకే పేద ముస్లింలపై ఎనలేని ప్రేమ చూపుతోందని రౌత్‌ విమర్శించారు. ఇండి కూటమి సభ్యులు వక్ఫ్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు అని, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని రూపొందించారని ఆరోపించారు.

వక్ఫ్‌ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుడు రాధామోహన్‌ దాస్‌ అగర్వాల్‌ చేసిన వ్యాఖ్యలతో రాజ్యసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ నేత రాజ్యసభకు ఎన్నికైన సమయంలో ఆ పార్టీ శ్రేణులు పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారని ఆరోపించారు.  ఆ నినాదాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ ఆరోపణలు తనపైనే చేశారంటూ కాంగ్రెస్‌ సభ్యుడు నజీర్‌ హుస్సేన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీ సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది.

వక్ఫ్‌ బిల్లును ఆమోదించడాన్ని ఆలిండియా ముస్లిం జమాత్‌ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్‌ రజ్వీ బరేల్వి స్వాగతించారు. ఈ బిల్లుతో ముస్లింల్లోని అణగారిన వర్గాలకు ఆర్థిక ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిల్లుకు అనుకూలంగా ఓటేసిన లోక్‌సభ సభ్యులకు, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, వక్ఫ్‌ బిల్లుపై బీజేడీ మాట మార్చింది. రాజ్యసభలో బీజేడీకి ఏడుగురు సభ్యులున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. గురువారం మాత్రం తమ సభ్యులు మనస్సాక్షి ప్రకారం ఓటు వేయొచ్చని తెలిపింది. ఎంపీలకు విప్‌ జారీ చేయబోమంది.