
రాజకీయం, మతం అంశాలను వివరిస్తూ మతాన్ని ఓ ప్రదేశానికి పరిమితి చేశారని, రాజకీయాలను కొంత మంది చేతుల్లోకి వదిలేశారని, ఇక్కడే సమస్య ఉత్పన్నం అవుతోందని యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తే, దాని వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆయన హెచ్చరించారు.
“మనం మతాన్ని ఒక స్థాయి వరకే పరిమితం చేస్తాం. రాజకీయాలను కొంత మందికే పరిమితం చేస్తాం. ఇందువల్లే సమస్య తలెత్తుతుంది. స్వార్థపూరిత రాజకీయాలతో సమస్యలు వస్తాయి. సువిశాల ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మాకు మతం చెప్పేది కూడా అదే” అని సీఎం యోగి పేర్కొన్నారు.
“భారత ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం, మతంలో స్వార్థభావనకు తావు ఉండదు. ఆధ్యాత్మిక భావనను జనంలోకి తీసుకెళ్లేందుకు రాజకీయాలు కూడా ఒక వేదిక” అని ఆయన చెప్పారు. అందరి మంచి కోసం రాజకీయం చేస్తే, దాని వల్ల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని తెలిపారు. ఒకవేళ స్వప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటే, అప్పుడు అది కొత్త సవాళ్లను సృష్టిస్తుందని, ఒకవేళ ఎవరైనా ఉన్నత ఆశయాలకు అంకితం అయితే, అప్పుడు ప్రగతి ద్వారాలు తెరుచుకుంటాయని యోగి ఆదిత్యనాథ్ వివరించారు.
భారతీయ సంప్రదాయంలో మతానికి, స్వప్రయోజనానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. భారతీయ తత్వ బోధనలో మతాన్ని స్వప్రయోజనాలతో లింక్ చేయలేదని పేర్కొన్నారు. భారతీయ మతతత్వం రెండు అంశాలను బోధిస్తుందని చెబుతూ ప్రాపంచిక జీవనంలో ప్రగతితో పాటు ఆధ్యాత్మిక విముక్తి కల్పిస్తుందని తెలిపారు. రెండు విధానాల్లోనూ సేవాభావం ఉందని చెప్పారు. కానీ రాజకీయాలతో మాత్రం కేవలం సేవా శక్తిని చాటవచ్చు అని యోగి తెలిపారు.
మతపరమైన వ్యక్తిగా ఉంటారా? లేక రాజకీయవేత్తగా భావిస్తారా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తాను ఒక పౌరుడిగా పనిచేస్తున్నానని, తనకు తాను ప్రత్యేకమైన వ్యక్తిగా భావించకోవడం లేదని ఆదిత్యనాథ్ చెప్పారు. ఒక పౌరుడిగా తనకు రాజ్యాంగ బాధ్యతలు ముందుంటాయని, తనకు దేశమే ముఖ్యమని స్పష్టం చేశారు.
దేశం సురక్షితంగా ఉంటే, అప్పుడు మతం సేఫ్‌గా ఉంటుందని, మతం భద్రంగా ఉంటే, అది సంక్షేమానికి దారి తీస్తుందని సీఎం యోగి వెల్లడించారు. రాబోయే వందేళ్ల పాటు నిలిచే ప్రతిష్ఠను సంపాదించానని భావిస్తున్నారా? అని యోగిని ప్రశ్నించగా, ‘‘పేరు ముఖ్యం కాదు. మనం చేసిన పనులే ముఖ్యం. అవే మనకు గుర్తింపును సాధించి పెడతాయి” అని బదులిచ్చారు.
రోడ్లు అనేవి ట్రాఫిక్ కోసం, వాటిపై నమాజ్ చేయొద్దని ముస్లింలకు సీఎం యోగి సూచించారు. హిందువులను చూసి మతపరమైన క్రమశిక్షణను అలవర్చుకోవాలని ముస్లింలకు హితవు పలికారు. వక్ఫ్ బోర్డులు భూముల కబ్జా గ్యాంగులుగా దశాబ్దాల తరబడి చలామణి అయ్యాయని ఆయన మండిపడ్డారు. అవి ముస్లింలకు చేసిందేమీ లేదంటూ వక్ఫ్ బిల్లును ప్రతిపక్షాలు విమర్శించడం, వ్యతిరేకించడం సరికాదని స్పష్టం చేశారు.
“హిందూ ఆలయాలు, మఠాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ భూములున్నా వక్ఫ్ బోర్డులు ఏమీ చేయలేకపోయాయి. ముస్లిం సంక్షేమానికి అవి పాటుపడలేదు. వక్ఫ్ బిల్లు వల్ల ముస్లింలకు ప్రయోజనం దక్కబోతోంది” అని యోగి తెలిపారు.
“యూపీలో ముస్లింలు 20 శాతం మందే. కానీ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందే వారిలో 40 శాతం మంది ముస్లింలు ఉన్నారు” అని ఆయన వెల్లడించారు. “మేం మౌలిక వసతుల కల్పన కోసం బుల్డోజర్ వాడుతాం. ఆక్రమణల తొలగింపు కోసం బుల్డోజర్ వాడుతాం. దాన్ని సమర్ధంగా ఎలా వాడాలో మేం అందరికీ చూపించాం” అని యోగి తెలిపారు.
More Stories
ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం