హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్ల భారీ నిరసన

హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్ల భారీ నిరసన
గత 17 నెలలుగా యుద్ధంతో శిథిలమైన గాజా స్ట్రిప్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక పక్క వేలాది మంది మరణం, మరో పక్క ఆస్తుల ధ్వంసం, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు.. వీటితో కొన్ని నెలలుగా విసిగి వేసారిన పాలస్తీనియన్లు యుద్ధానికి ముగింపు పలికి, అధికారం నుంచి తొలగాలని హమాస్‌ మిలిటెంట్లపైనే నిరసనకు దిగారు.

2007 నుంచి తమను పాలిస్తున్న హమాస్‌ మిలిటెంట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాలస్తీనియన్లు భారీ నిరసన ప్రదర్శన చేశారు. యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తర ప్రాంత పట్టణం బీట్‌ లేహియాలో వందలాది మంది నిరసనకారులు ప్ల కార్డులు చేతబట్టి హమాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాల వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

మాకీ యుద్ధం వద్దు, మేము చావాలనుకోవడం లేదు. మా పిల్లల రక్తం చవక కాదు అంటూ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ.. హమాస్‌ వైదొలగాలి అంటూ నినాదాలు చేశారు. హమాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు యుద్ధానికి ముగింపు పలికి, అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. 

ఐడీఎఫ్‌ దాడులతో ధ్వంసమైన ఉత్తర గాజాలోని బీట్ లాహియాలోని రోడ్లపైకి చేరిన వందలాది మంది, హమాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము శాంతియుతంగా జీవించాలని భావిస్తున్నట్లు నిరసనకారులు తెలిపారు. బాంబు మోతలు, హత్యలు, వలసలు, ఆకలికేకలతో నిత్యం నరకం అనుభవిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ నిరసన రాజకీయాల గురించి కాదని, తమ పిల్లల భవిష్యత్తు కోసమని చెప్పారు. మొదట కొంత మందితో మొదలైన నిరసనకు తర్వాత వేలాదిగా జతకలిశారు. యుద్ధం ఆపాలని జరుగుతున్న ఈ నిరసనలను అణచివేసేందుకు నిరసనకారులను బంధించి హమాస్ హింసిస్తోందని మానవ హక్కుల సంఘాలు తెలిపాయి.

మరోవైపు గాజాలోని హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక హెచ్చరిక చేశారు. హమాస్ వద్ద ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయాలని సూచించారు. బందీలను విడుదల చేయడానికి హమాస్ ఎంత నిరాకరిస్తే, తాము అంత బలంగా ఒత్తిడి తెస్తామని చెప్పారు. చివరకు గాజాను కూడా స్వాధీనం చేసుకోవచ్చని నెతన్యాహు హెచ్చరించారు. 

ఇంకా తమ దగ్గర ఉన్న జాబితాను చెప్పాలనుకోవట్లేదని నెతన్యాహు పేర్కొన్నారు. హమాస్ చెరలోని బందీలు విడుదల అయ్యే వరకు ఇజ్రాయెల్ పోరాటాన్ని ఆపబోదని స్పష్టం చేశారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి దూసుకెళ్లిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో పలువురిని కాల్పుల విరమణ ఒప్పందాల సమ

యంలో విడుదల చేశారు. బందీల్లో పలువురు మృతి చెందారు. హమాస్ వద్ద ఇంకా 24 మంది బందీలు ప్రాణాలతో ఉన్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ఇజ్రాయెల్‌ భీకర దాడుల నేపథ్యంలో హమాస్ తీవ్ర హెచ్చరిక చేసింది. గాజా పట్టీపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూ సైన్యం ద్వారా బందీలను తరలించేందుకు ప్రయత్నిస్తే వారంతా శవపేటికల్లో తిరిగొస్తారని తెలిపింది. 

సాధ్యమైనంతవరకు బందీలను సజీవంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. కానీ ఇజ్రాయెల్ బాంబు దాడులు వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని హమాస్ ఓ ప్రకటన చేసింది. తాజాగా గాజా సిటీలోని కొన్నిప్రాంతాలను ఖాళీ చేయాలని ఐడిఎఫ్ ఆదేశాలు జారీచేసింది. నివాసాలు ఖాళీచేసి వెళ్లాలని జీటౌన్ , టెల్ అల్ -హవా ప్రజలకు సూచించింది.

హమాస్ వద్ద ఇంకా 59మంది బందీలు ఉండగా వారిలో 24మంది సజీవంగా ఉన్నట్లు సమాచారం. మిగతా బందీలను అప్పగించే వరకు దాడులు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టంచేశారు. శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందంతోపాటు తమ భూభాగం నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలిగే వరకూ బందీలను విడుదల చేయబోమని హమాస్ అంటోంది.