ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!

ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!
ఒకే దేశం- ఒకే ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ పదవీకాలాన్ని పొడిగించేందుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. కమిటీ పదవీకాలం పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల చివరి వారం తొలి రోజు వరకు ఉండనున్నది. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ పీపీ చౌదరి లోక్‌సభలో కమిటీ పదవీకాలాన్ని పొడిగించే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా, వాయిస్‌ ఓటు ద్వారా ఆమోదించారు. 
 
రాజ్యసభ నుంచి కొత్త సభ్యుడికి కూడా పార్లమెంటరీ కమిటీలో స్థానం కల్పించినట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ సభకు తెలిపారు. వైఎస్సార్‌సీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాంతో 39 మంది సభ్యుల కమిటీలో ఓ పోస్టు ఖాళీ కావడంతో కొత్తగా సభ్యుడికి చోటు కల్పించారు. 
 
దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం విధితమే. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని, జేపీసీకి బిల్లును పంపాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీంతో 39 మంది ఎంపీలతో జేపీసీ కమిటీ ఈ బిల్లును అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసింది. 
 
ఈ కమిటీలో లోక్‌సభ 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వం వహిస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, మనీశ్‌ తివారీ, ప్రియాంక గాంధీ, బన్సూరి స్వరాజ్, సంబిత్ పాత్రాతో పాటు పలువురు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ కాల పరిమితి ఏప్రిల్‌ 4తో ముగియనున్నది. 
 
బిల్లుపై ఇంకా చర్చించాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ఇప్పటికే న్యాయ నిపుణులతో కమిటీ చర్చలు జరిపింది. సుప్రీంకోర్టు మాజీ సీజేఐలు జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వే, డిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏపీ షా కమిటీ ఎదుట హాజరైన అభిప్రాయాలను తెలిపారు. ఇప్పటి వరకు ఐదు సమావేశాలు  జరుపగా,ఆరవ సమావేశం మంగళవారం జరుగనుంది.