బెంగాల్​, తమిళనాడులలో పోలింగ్ ప్రారంభం

బెంగాల్​, తమిళనాడులలో పోలింగ్ ప్రారంభం

ఐదు అసెంబ్లీ ఎన్నికలకు భాగంగా గురువారం తమిళనాడులోనూ, పశ్చిమ బెంగాల్‌లో తొలి దశ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహిస్తుండగా, బెంగాల్‌లో 16 జిల్లాల్లోని 152 స్థానాలకు పోలింగ్‌కు జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్‌కు అనుమతిస్తారు. 

ఉత్తర బెంగాల్‌లోని కూచ్‌ బెహార్‌, అలీపుర్‌దువార్‌, జల్‌పైగురి, డార్జిలింగ్‌, కాలింపాంగ్‌, ఉత్తర దినాజ్‌పూర్‌, దక్షిణ్‌ దింజాపూర్‌, మాల్దా జిల్లాలోనూ, దక్షిణ బెంగాల్‌లో ముర్షిదాబాద్‌, పశ్చిమ్‌ బర్ధమాన్‌, బీర్భూమ్‌, పుర్బా మేదినీపూర్‌, పశ్చిమ్‌ మెదినీపూర్‌, బంకురా, పురూలియా, ఝర్‌గ్రామ్‌ జిల్లాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి.  బెంగాల్‌లో ఎన్నికల కోసం ఇసి భారీ ఏర్పాట్లను చేసింది. దాదాపు 2.5 లక్షల మంది సిబ్బందితో పాటు రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను మొహరించింది.

ఎఐ మద్దతుతో 152 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను అమలు చేస్తోంది.  బెంగాల్‌లోని మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న రెండో దశలో పోలింగ్‌ నిర్వహిస్తారు. దీంతో ఐదు అసెంబ్లీకు ఎన్నికలు పూర్తవుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉధృతంగా ఎన్నికల ప్రచారం జరిగింది. సంప్రదాయంగా జరిగే ముఖాముఖీ పోటీకి బదులుగా ఇప్పుడు ముక్కోణపు పోటీ ఏర్పడింది. డీఎంకే నేతృత్వంలోని అధికార సెక్యులర్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌(ఎస్‌పీఏ) రెండవ పర్యాయం అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నది. 

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ద్రవిడియన్‌ మోడల్‌ పాలనపై తన ప్రచారాన్ని కేంద్రీకరించారు. ఈ కూటమిలో డీఎంకేతోపాటు కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, వీసీకే ఉన్నాయి. ఇక ఏఐఏడీఎంకే నేతృత్వంలో బీజేపీతో కలసి ఎన్‌డీఏ కూటమి తలపడుతున్నది. డీఎంకే ప్రభుత్వంలో అవినీతి, శాంతి భద్రతల పరిస్థితిపై ఎన్‌డీఏ ఫోకస్‌ పెట్టింది. ఇక మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు విజయ్‌ సారథ్యంలోని టీవీకే రెండు ప్రధాన కూటములకు గట్టి పోటీని ఇస్తున్నది. 

2011 నుంచి అప్రతిహతంగా మూడుసార్లు విజయాన్ని సాధించి నాలుగోసారి అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పోరాడుతుండగా ఈసారి ఎలాగైనా మమత ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నది. అధికార టీఎంసీ ప్రచారం మమత జనాకర్షణ శక్తిపైనే పూర్తిగా ఆధారపడగా బీజేపీకి చెందిన జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు బెంగాల్‌లో మోహరించి ప్రచారం సాగించారు.