మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆదివారం జరిగిన కామెడీ షోలో కమ్రా మాట్లాడుతూ థాణే నుంచి వచ్చిన ఓ నాయకుడు బీజేపీతో చేతులు కలిపి శివసేనను చీల్చేశాడని, అతడు దేశద్రోహి అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఈ విషయమై నమోదైన కేసులో ప్రశ్నించడానికి ముంబై పోలీసులు నోటీసు జారీచేయగా, తనకు ఒక వారం రోజుల సమయం అవసరమని కామ్రా సమాధానం ఇచ్చారని పొలిసు వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏక్‌నాథ్ షిండే తొలిసారి స్పందించారు. కమెడియన్ వేసిన సెటైర్ తనకు అర్థమైందని పేర్కొంటూ అయితే దేనికైనా పరిమితి ఉండాలని హెచ్చరించారు.
బీబీసీ మరాఠీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షిండే మాట్లాడుతూ “ప్రతీ వ్యక్తి ఒక నిర్దిష్ట స్థాయిని కొనసాగించాలి. లేదంటే చర్య ప్రతిచర్యకు కారణమవుతుంది. భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికీ తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఇచ్చింది. కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది” అని స్పష్టం చేశారు.
“నాపై ఇలాంటి సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లు ఉంది” అని షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యమని, కానీ వేరే వారి తరఫున ఇతరుల గురించి ఇలా తప్పుగా మాట్లాడటం సరికాదని హితవు చెప్పారు. “ఇలాంటి పనులు చేయడానికి ఆయన ఎవరి నుంచి సుపారి తీసుకుంటారు? ప్రజా స్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యం. కానీ ఒకరి ఆదేశం మేరకు మరొకరి గురించి తప్పుగా మాట్లాడటం ఎంత వరకు సరైంది?” అని ప్రశ్నించారు.
“నా గురించి మర్చిపోండి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఆర్థిక మంత్రి, హోం మంత్రి, పారిశ్రామికవేత్తల గురించి ఏం మాట్లాడారో చూడండి” అని గతంలో కామ్రా చేసిన వ్యాఖ్యలను షిండే ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదేవిధంగా జర్నలిస్ట్ అర్బాబ్ గోస్వామితో కునాల్ కమ్రా ఘర్షణను కూడా ఈ సందర్భంగా షిండే గుర్తు చేశారు.
జర్నలిస్ట్‌తో గొడవ పడి విమాన ప్రయాణ నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కమ్రాను వాతావరణాన్ని కలుషితం చేసే, శాంతి భద్రతల పరిస్థితిని ప్రభావితం చేసే వ్యక్తిగా అభివర్ణించారు.
అంతకుముందు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని కమెడియన్ కునాల్ కామ్రా స్పష్టం చేశారు. శిందేపై తాను ఉపయోగించిన మాటలు ఇంతకుముందు మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వాడారని చెప్పారు. దాడులకు పాల్పడుతున్న వారిని చూసి భయపడబోనని, మంచం కింద దాక్కొనని ఎక్స్ మాధ్యమంలో కునాల్ కామ్రా పోస్ట్ చేశారు.
తాను కామెడీ చేయడానికి ఉపయోగించిన వేదికను కూల్చడం సరికాదని పేర్కొన్నారు. తనకు గుణపాఠం చెబుతానని రాజకీయ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ కేవలం ధనవంతులు, శక్తివంతులమైన వారికి మాత్రమే కాదని తెలిపారు. తనపై చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా పోలీసులకు, కోర్టులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా, ఈ ఘటనపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ తీవ్రంగా స్పందిస్తూ కేవలం 2 నిమిషాల ఫేమ్ కోసం ఒకరిని అగౌరవపరచడం సరికాదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ వివాదానికి కారణమైన వేదికను కూల్చడం చట్టబద్ధమైన చర్య అని పేర్కొన్నారు. అయితే, గతంలో తనపై తీసుకున్న చర్యమాత్రం చట్టవిరుద్ధం అని ఆమె వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ వెలుపల మీడియాతో ఆమె మాట్లాడుతూ “2 నిమిషాల ఫేమ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మన సమాజం ఎక్కడికి వెళుతోంది? మాట్లాడింది ఎవరైనా కావొచ్చు. కానీ, ఒకరిని అవమానించడం, వారి పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం సరైందికాదు. గౌరవమే సర్వస్వం అని భావించే వ్యక్తిని మీరు కామెడీ పేరుతో అవమానిస్తున్నారు” అంటూ ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
“కామెడీ పేరుతో మన సంస్కృతిని, ప్రజలను దూషిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి ఆ వేదికను కూల్చడం చట్టబద్ధంగానే జరిగింది. కానీ, నా విషయంలో మాత్రం చట్టవిరుద్ధంగానే జరిగింది” అని కంగన వ్యాఖ్యానించారు. 2020లో కంగన రనౌత్, అప్పటి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
మూవీ మాఫియా కంటే ముంబై పోలీసులంటేనే భయంగా ఉందంటూ కంగన వ్యాఖ్యానించారు. ఇవి కాస్తా రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ క్రమంలో మహా ప్రభుత్వం, కంగన మధ్య కొన్ని రోజులపాటూ మాటల యుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో ముంబై బాంద్రాలోని నటి కార్యాలయంలోని కొంత భాగాన్ని బీఎంసీ కూల్చివేసింది.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత