మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణలో పురోగతి

మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణలో పురోగతి

* ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు

మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణ ప్రక్రియలో పురోగతి సాధించినట్లు, మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్  చెప్పారు. మణిపూర్ హైకోర్టు 12వ వార్షికోత్సవం సందర్భంగా ఇంఫాల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమం అనంతరం మేఘ్వాల్ విలేకరులతో మాట్లాడారు. 

“ప్రశాంతత పునరుద్ధరణ ప్రక్రియలో మేము పురోగమించాం. ఈ విషయమై మరింత ముందుకు సాగవలసిన అవసరం ఉంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించి, శాంతి పునరుద్ధరణ ఆవశ్యకత గురించి నొక్కిచెప్పాం. అతి త్వరలో రాష్ట్రంలో తిరిగి శాంతిని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం నిబద్ధమై ఉంది” అని కేంద్ర మంత్రి తెలిపారు. 

హైకోర్టు వార్షికోత్సవ సభలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, “మణిపూర్‌లో ప్రస్తుత శాంతి పునరుద్ధరణ ప్రక్రియ వేగం పుంజుకోవాలని ప్రార్థిస్తున్నాను. దీని వల్ల రాష్ట్రం పురోగమించి, వికసిత్ భారత్‌కు తోడ్పడగలదు” అని చెప్పారు. రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

జస్టిస్ వర్మ నివాసంలో నగదు స్వాధీనం వివాదంపై విలేకరుల ప్రశ్కు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సమాధానం ఇస్తూ ‘సుప్రీం కోర్టు ఆ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తోంది. కమిటీ నివేదిక రానివ్వండి. ఆ తర్వాత మాట్లాడతాం’ అని చెప్పారు.

కాగా, జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ప్రతినిధివర్గం మణిపూర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నది. శనివారం వారు సహాయ శిబిరాలను సందర్శించి, అంతర్గత నిర్వాసితులతో సంభాషించారు. ఆ ప్రతినిధివర్గం చురాచంద్‌పూర్ జిల్లా లమ్కాలో మినీ సెక్రటేరియట్‌లో న్యాయ సేవల శిబిరాన్ని, వైద్య శిబిరాన్ని, న్యాయ సహాయ క్లినిక్‌ను వర్చువల్‌గా ప్రారంభించింది. 

మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు సంఘటితంగా కృషి చేయవలసిందిగా ప్రజలకు జస్టిస్ గవాయ్ విజ్ఞప్తి చేశారు. ఈ ఈశాన్య రాష్ట్రంలో ‘ప్రస్తుత సంక్లిష్ట దశ’ కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ సాయంతో త్వరలోనే పరిసమాప్తం కాగలదనే ఆశాభావాన్ని జస్టిస్ గవాయ్ వ్యక్తం చేశారు.

ఇలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతో అనువదించే ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌)ల సహకారంతో కోర్టులో జరిగే వాదనలు, తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. 
 
నేషనల్‌ ఇన్‌ఫర్మటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ఇందులో కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. పార్లమెంటులో ఇటీవల మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. తెలుగుతోపాటు అస్సామీ, బెంగాలీ, గారో, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, ఖాసీ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంథాలీ, తమిళం, ఉర్దూల్లోకి అనువదిస్తున్నట్టు వివరించారు.
ఇందుకోసం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఐఐటీ- మద్రాసు సహకారం తీసుకుంటోందని తెలిపారు. అనువాదాలకు సంబంధించిన నమానాలను 200 మంది అడ్వకేట్‌ ఆన్‌ రికార్డు(ఏవోఆర్‌)లకు అందించామని పేర్కొన్నారు. వాటిపై వారి అభిప్రాయాలను కోరామని తెలిపారు. ఏఐ సాంకేతికతను కేవలం కోర్టులోని వాదనలు, తీర్పుల అనువాదానికి మాత్రమే పరిమితం చేస్తున్నామని, న్యాయ నిర్ణయంలో ఎటువంటి పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు.