మందుపాతరాలతో మావోయిస్టులు భద్రతా బలగాల కట్టడి!

మందుపాతరాలతో మావోయిస్టులు భద్రతా బలగాల కట్టడి!

దేశంలో 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చెయ్యాలనే పట్టుదలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారధ్యంలో భద్రతా దళాలు ఆపరేషన్‌లను ఒక వంక ఉద్ధృతం చేస్తుండగా తమకున్న పరిమిత వనరులతో వారిని కట్టడి చేసేందుకు మావోయిస్టులు మందుపాతరలు ఆయుధంగా వాడుకొంటున్నారు. గత మూడు నెలల వ్యవధిలోనే దాదాపు 120 మంది మావోయిస్టులు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో మృతి చెందారు. 

అయితే, యాంటీ రక్షణ దళాలకు మావోయిస్టులు అటవీ ప్రాంతాలలో ముందుజాగ్రత్తగా అమర్చిన మందుపాతరలు సవాల్‌గా మారుతున్నాయి. ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లో ఐఈడీ పేలుళ్లు, స్వాధీనం ఘటనలు గణనీయంగా పెరిగాయి. మరోవైపు సిగ్నల్స్‌ ద్వారా దూరం నుంచి పేల్చగల రిమోట్‌ కంట్రోల్డ్‌ ఐఈడీలూ లభ్యమవుతుండటం కలవరం రేపుతోంది.

వేసవి కాలంలో అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉండటంతో ఇదే అదనుగా వారు ఉండే ప్రాంతాలకు దగ్గరగా క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ ఏరివేత చేపట్టాలని భద్రతా సిబ్బంది భావిస్తున్నారు. అయితే మావోయిస్టులు నేరుగా తలపడకుండా మందుపాతరలతో పోలీసులకు సవాలు విసురుతున్నారు. 

అధికారిక గణాంకాల ప్రకారం గతేడాది ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతరలకు సంబంధించి 78 పేలుళ్లు, స్వాధీనం ఘటనలు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో మార్చి మధ్య నాటికే ఈ సంఖ్య 100 దాటింది. 2020-22లో సెక్యూరిటీ క్యాంపులకు 3-7 కిలోమీటర్ల పరిధిలో ఐఈడీలు లభ్యమయ్యేవని, 2023-24 మధ్యకాలంలో అవి మూడు కిలోమీటర్లలోపే వెలుగుచూస్తున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. 

2020-21తో పోలిస్తే 2022-24లో ఈ తరహా ఘటనలు 25 శాతం పెరిగాయని తేలింది. గతేడాది కాలంలో ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో 70కుపైగా కొత్త ఫార్వర్డ్‌ ఆపరేటింగ్‌ బేస్‌ ఎఫ్ఓబిలు ఏర్పాటయ్యాయి. వీటి సంఖ్య పెరిగిన కొద్ది ఐఈడీ ఘటనలూ పెరుగుతున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.

ఇటీవల కాలంలో రిమోట్‌ కంట్రోల్డ్‌ ఐఈడీల ముప్పు ఆందోళనకరంగా మారింది. గతవారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌ జిల్లాలో సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌ సమీపంలో 5 కిలోల పేలుడు పదార్థం వెలుగు చూడటం కలకలం రేపింది. బాంబు వద్ద రెండు ఖాళీ బీరు సీసాలతోపాటు దూరం నుంచి పేల్చేందుకు వీలుగా సమీపంలోని ఓ చెట్టు కింద వైర్‌తో అనుసంధానమై ఉన్న చిన్న యాంటెన్నా కూడా లభ్యమైంది. 

ఈ ఏడాది జనవరిలో బీజాపుర్‌ జిల్లాలోనే ఓ వంతెన కింద తొలిసారి ఈ తరహా ఐఈడీని సీఆర్పీఎఫ్‌ స్వాధీనం చేసుకుంది. అది 50 కిలోల మేర ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆర్‌సీఐఈడీల వాడకం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. సాధారణ మందుపాతరలతో పోలిస్తే దూరం నుంచి వీటిని పేల్చే వీలుండటంతో మరింత ప్రమాదకరమని హెచ్చరించారు.

మావోయిస్టుల టిసిఓసి (టాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపెయిన్‌) సమీపిస్తున్న నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లలో ఐఈడీ దాడుల విషయంలో రక్షణ దళాలకు “హై అలర్ట్ ” జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. వేసవిలో అడవి పరిస్థితులను అనుకూలంగా మలచుకుని భద్రతాదళాలపై దాడులు చేసేందుకు మావోయిస్టులు టీసీవోసీ చేపడతారు. 

మావోయిస్టులను నిర్మూలనకోసం పనిచేస్తున్నాయి. ముఖ్యంగా బస్తర్‌లోని మారుమూల ప్రాంతాలకూ చొచ్చుకెళ్తున్నాయి. కొత్త క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు ఆయుధాల కొరతతో మావోయిస్టులు ప్రత్యక్ష దాడులకు వెనుకంజ వేస్తున్నారు. బలగాలకు భారీ నష్టం చేకూర్చే లక్ష్యంతో మందుపాతరల మార్గాన్ని ఎంచుకుంటున్నారని అధికారులు తెలిపారు.