
* విష్ణుప్రియ ఫోన్ సీజ్ * తెలుగు ఫిల్మ్ చాంబర్ హెచ్చరిక
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ప్రముఖ నటులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో సహా దాదాపు 25 మందిపై సైబారాబాద్‌కి చెందిన మియాపుర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువతను చెడగొడుతున్నారని మియాపుర్‌కి చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ప్రమోషన్లను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన మియాపూర్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ తెలుగు నటులు రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, ప్రణీత, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్ల తదితరులపై కేసు నమోదు చేశారు.
ఇక సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లలలో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత వంటి పేర్లు ఉన్నాయి. కాగా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌లో ఆరోపణలు ఎదుర్కోంటున్న యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చి విచారణకు హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు విష్ణుప్రియను విచారించిన పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసి ఫోన్‌ని సీజ్ చేసినట్లు సమాచారం.
ఈ ప్రచారం ద్వారా యువకులు, సామాన్యులు ఎక్కువగా ఆకర్షితులై లక్షలాది రూపాయలు పోగొట్టుకుని రోడ్డుపాలయ్యారు, కొంతమంది ఆర్థికంగా చాలా నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. తమ అభిమాన నటులు తాము కూడా బెట్టింగ్ యాప్‌ల ద్వారా డబ్బులు సంపాదించామని ప్రకటనల్లో చెప్పడంతో నమ్మి లక్షలాది రూపాయలు పెట్టారు.
దీంతో అమాయకుల డబ్బులు పోవడంతో ఇబ్బందులపాలయ్యారు. వీరి చేసిన ప్రకటనలపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు వీరు చేసిన ప్రకటనల గురించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆయా సంస్థలు, నటులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. బెట్టింగ్ యాప్‌లపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.ప్రమోట్ చేసిన వారిపై పోలీసులు బిఎన్‌ఎస్, ఐటి యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
ఇలా ఉండగా, కొందరు తెలియక, మరికొందరు తెలిసే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారైనా, మరొకరైనా చట్టానికి, న్యాయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రెండురోజులు బెట్టింగ్ యాప్ కేసుల వ్యవహారంపై సినీ ఇండస్ట్రీలోనూ చర్చ జరుగుతుందని, యాప్‌ల కారణంగా సమాజానికి చెడు జరుగుతుంటే, అది ముమ్మాటికి తప్పేనని తేల్చి చెప్పింది.
ఈ విషయంలో రెండురోజుల్లో ‘మా’కు లేఖ రాయనున్నట్లు, యాప్స్ ప్రమోషన్స్ నిర్వహించే నటీనటులపై చర్యలు తీసుకోవాలని ‘మా’ను కోరనున్నట్లు టీఎఫ్‌సీసీ పేర్కొంది. డబ్బుల కోసం, రాత్రికి రాత్రే ఫేమ్ అయ్యేందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారని, వాటిని ప్రోత్సహించడం తప్పని, సమాజానికి హాని చేసే వాటిపై విచక్షణతో వ్యవహరించాలని సూచించింది. ఈ విషయంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ బాధ్యతగా అవగాహన కల్పిస్తామని, అయినా యాప్‌ల కోసం ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను