
కాగా, 2020 జూన్ 8న మలాడ్‌లోని ఎత్తైన భవనం 14వ అంతస్తు నుంచి కిందపడి దిశా సాలియన్ మరణించింది. యాక్సిడెంటల్ డెత్‌గా పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె మరణంలో ఎలాంటి అనుమానం లేదని దిశా తండ్రి సతీశ్ నాడు తెలిపారు. దర్యాప్తు పట్ల పూర్తిగా సంతృప్తి చెందినట్లు ఆయన చెప్పారు.
అయితే దిశా సాలియన్ మరణించిన ఐదేళ్ల తర్వాత ఆమె తండ్రి సతీష్ సాలియన్ తాజాగా బాంబే హై కోర్టును ఆశ్రయించారు. 2020 జూన్ 8న తన ఇంట్లో దిశా పార్టీ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఆదిత్య ఠాక్రే, ఆయన బాడీ గార్డులు, నటులు సూరజ్ పంచోలి, డినో మోరియాతో పాటు మరికొందరు ఈ పార్టీకి హాజరైనట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
మరోవైపు ఈ పార్టీ సందర్భంగా దిశాపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని ఆమె తండ్రి సతీష్ ఆరోపించారు. బిల్డింగ్ పైనుంచి కిందపడి దిశ చనిపోయిందని చెబుతున్నప్పటికీ ఆమె శరీరంలో ఒక్క ఫ్రాక్చర్ కూడా లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఘటనా స్థలంలో రక్తం మరకలు కూడా లేవన్నారు.
నిందితులను రక్షించడానికి రాజకీయ ఒత్తిళ్లతో ఫోరెన్సిక్ సాక్ష్యాలను ధ్వంసం చేశారని, సీసీటీవీ ఫుటేజీని కూడా తారుమారు చేశారని దిశా తండ్రి ఆరోపించారు. సరైన పోస్ట్‌మార్టం విశ్లేషణ లేకుండానే హడావుడిగా దహన సంస్కారాలు చేసినట్లు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన అదే రోజున శవపరీక్ష నిర్వహించగా, దిశ పోస్ట్‌మార్టం 50 గంటలకు పైగా ఆలస్యమైందని సతీష్ పేర్కొన్నారు.
‘ప్రధాన నిందితుడు ఆదిత్య ఠాక్రే’ను రక్షించడానికి లైంగిక వేధింపుల సాక్ష్యాలను నాశనం చేయడం లక్ష్యంగా పోస్ట్‌మార్టం ఆలస్యంగా జరిగిందని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. ఆదిత్య ఠాక్రే, ఇతరులపై కేసు నమోదు చేసి సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోర్టును కోరారు. తన న్యాయవాది ద్వారా ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, తన పరువు తీసేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని ఆదిత్య ఠాక్రే ఆరోపించారు. గత ఐదేళ్లుగా ఈ ఆరోపణలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై కోర్టులో స్పందిస్తానని చెప్పారు. ఈ పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఐదేళ్ల తర్వాత పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత