
”ముందుగానే నాపై ఒక అభిప్రాయానికి ఎలా వస్తారు ? నన్ను జడ్జ్ చేయడానికి మీకున్న అర్హత ఏమిటి ? ” అని సినీనటి, బిజెపి ఎంపి కంగనా రనౌత్ ప్రశ్నించారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని ఉద్దేశించి దర్శక, నిర్మాత సంజయ్ గుప్తా ఇచ్చిన సమీక్షపై ఆమె స్పందించారు. కంగన తన అంచనాలు తప్పని నిరూపించారని ఆయన పేర్కొనడంపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముందుగానే తనపై ఒక అభిప్రాయానికి రావద్దు అని సూచించారు.
”నాపై ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చినట్టు ఆయన తన పోస్ట్‌లోనే అంగీకరించారు. నన్ను అర్థం చేసుకోవడంలో మీరు పరాజయం అయినప్పుడు.. మళ్లీ నాపై ఒక అభిప్రాయానికి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? నా అభిప్రాయం తప్పిందని ఆయన పేర్కొన్నారు. నేను ఎలాంటి సినిమా చేశానో మీకు ముందే ఎలా తెలుసు? నా గురించి ముందే తెలుసుకునేందుకు మీవద్ద ఏమైనా అద్భుత శక్తులు ఉన్నాయా?” అని ఆమె నిలదీశారు.
“ఒక వ్యక్తి గురించి ఏదైనా అభిప్రాయానికి రావాలంటే వాళ్ల గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఉండాలి. అయినా నన్ను జడ్జ్ చేసేందుకు మీకున్న అర్హతలు ఏమిటి? మీరు ఎలాంటి సినిమాలు రూపొందించారు? ఇండిస్టీలో ఉన్నవాళ్లు కూడా.. తాము ఎలాంటి సినిమాలు తెరకెక్కిస్తున్నారో ఒక్కసారి చెక్ చేసుకోవాలి ” అని కంగనా పేర్కొన్నారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని ఆమె రూపొందించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించి నిర్మాతగానూ వ్యవహరించిన కంగనా ఇందిరా గాంధీ పాత్రలో నటించారు. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రస్తుతం ఇది ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఇటీవల ఈ సినిమా గురించి సంజయ్ గుప్తా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ”ఎమర్జెన్సీ’ వీక్షించా. కంగన దీనిని ఇంత చక్కగా రూపొందిస్తారని నేను ఏమాత్రం ఊహించలేదు. ఆమె నా అంచనాలు తారుమారు చేశారు. ఇదొక అద్భుతమైన చిత్రం. చిత్రాన్ని ఆమె తెరకెక్కించిన తీరు.. ఆమె నటన చాలా బాగున్నాయి” అని కొనియాడారు.
More Stories
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కంచి కామకోటి పీఠాధిపతిగా గణేష శర్మ
పరువునష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్టు, విడుదల