టీటీడీ నిధుల మళ్లింపుపై హైకోర్టు ఆగ్రహం

టీటీడీ నిధుల మళ్లింపుపై హైకోర్టు ఆగ్రహం

తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) చెందిన నిధులను ధార్మిక అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. భక్తుల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం టీటీడీ నిధులను ఖర్చు చేయవచ్చన్న ప్రభుత్వం వాదనపై అభ్యంతరం తెలిపింది.

అలా అయితే తమిళనాడు నుంచి భక్తులు వస్తున్నారని టీటీడీ నిధులతో 6 వరసల జాతీయ రహదారిని 8 వరసలుగా విస్తరించొచ్చా? అని ప్రశ్నించింది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలోని రహదారుల నిర్మాణానికి, పారిశుద్ధ్య పనులకు వినియోగించే నిమిత్తం అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై వైఖరి తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా), టీటీడీని హైకోర్టు ఆదేశించింది. 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రహదారులు, కాలనీల పారిశుద్ధ్యం పనులకు ఏటా సుమారు రూ.100 కోట్లు టీటీడీ నిధులు వినియోగించేందుకు ఈవో ఆమోదం తెలపడాన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత జి. భానుప్రకాశ్‌ రెడ్డి 2023లో హైకోర్టులో పిల్‌ వేశారు. 

అప్పట్లో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం దేవుడికి భక్తులిచ్చిన సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. సొమ్మును విడుదల చేయవద్దని గతంలో టీటీడీ అధికారులను ఆదేశించింది. ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది రేగులగడ్డ వెంకటేష్‌ వాదనలు వినిపించారు.

ఇతర అవసరాలకు టీటీడీ నిధులను మళ్లించడం దేవాదాయ చట్ట నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. హిందూ ధర్మం, భక్తుల సంక్షేమం కోసమే నిధులను వినియోగించాలని తెలిపారు. కొత్త బోర్డు ఏర్పాటు అయిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని టీటీడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 

ప్రభుత్వ వైఖరేమిటని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ప్రణతి బదులిస్తూ భక్తుల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం కోసం టీటీడీ నిధులను ఖర్చు చేయవచ్చు అని చెప్పారు. ఆ వాదనపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది.