జార్జ్ సోర‌స్ ఫౌండేష‌న్ ల‌బ్ధిదారుల‌పై ఈడీ సోదాలు

జార్జ్ సోర‌స్ ఫౌండేష‌న్ ల‌బ్ధిదారుల‌పై ఈడీ సోదాలు
అమెరికా బిలియ‌నీర్ జార్జ్ సోర‌స్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేష‌న్స్ ల‌బ్ధిదారుల‌పై ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ సోదాలు నిర్వ‌హించింది. బెంగుళూరులో ఉన్న కేంద్రాల‌పై త‌నిఖీ చేశారు. విదేశీ మార‌కం అంశంలో ఉల్లంఘ‌న‌లు జ‌రిగిన‌ట్లు అనుమానాలు ఉన్నాయి. ఫెమా చ‌ట్టం కింద ఆ త‌నిఖీలు చేప‌ట్టారు. అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘాలకు చెందిన ఆఫీసుల్లో సోదాలు జరిగాయి.
 
జార్జ్ సోర‌స్‌కు చెందిన ఓఎస్ఎఫ్ అక్ర‌మ రీతిలో విదేశీ పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు కేసులు ఉన్నాయి. అయితే ఆ నిధుల‌ను ఫెమా నిబంధ‌న‌లు ఉల్లంఘించి అక్ర‌మ రీతిలో వినియోగించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈడీ చేస్తున్న సోదాల గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఓపెన్ సొసైటీ ఫౌండేష‌న్స్ సంస్థ రియాక్టు కాలేదు. భార‌త దేశ ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా అమెరికా బిలియ‌నీర్ జార్జ్ సోర‌స్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు కేంద్రంలోని బీజేపీ పార్టీ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే.
అదానీ-హిండ‌న్‌బ‌ర్గ్ వివాదంపై సోర‌స్ సంస్థ కీల‌క ఆరోప‌ణ‌లు చేసింది. దీన్ని కూడా బీజేపీ ఖండించింది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మాన‌వ హ‌క్కుల సంఘాలు, న్యాయ‌మూర్తులు, బాధ్య‌తాయుత ప్ర‌భుత్వాల‌కు ఓఎస్ఎఫ్ సంస్థ నిధుల‌ను అంద‌జేస్తుంది. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 2021లో సోర‌స్ సంస్థ నుంచి ఇండియాకు సుమారు నాలుగు ల‌క్ష‌ల డాల‌ర్లు విరాళం అందిన‌ట్లు తెలుస్తోంది. 1999 నుంచి ఓఎస్ఎఫ్ ఇండియాలో ప‌నిచేస్తున్న‌ది. విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు ఇస్తున్న‌ది.