థానేలో శివాజీ మహరాజ్ ఆలయం ప్రారంభం

థానేలో శివాజీ మహరాజ్ ఆలయం ప్రారంభం

థానే జిల్లా భివండి పట్టణంలో ఉన్న మరాడేపాడా ఏరియాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆలయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రారంభించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శివాజీ జయంతి సందర్భంగా సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  “హనుమంతుడి దర్శనం లేకుండా శ్రీరాముడి దర్శనం పూర్తి కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ దర్శనం లేకుండా ఏ దేవుడి దర్శనం మనకు ఎప్పటికీ ఫలించదు” అని ఫడ్నవిస్ స్పష్టం చేశారు.

“ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలయం  ఎందుకంటే ఆయన మనందరి మనసుల్లో సజీవంగా ఉన్నారు. మన దేశం కోసం, మన మతం కోసం శివాజీ మహారాజ్ యుద్ధం చేసి గెలిచారు. స్వరాజ్య సాధన కోసం ఆయన పోరాడారు. అందుకే ఇప్పుడు మీరు, నేను హిందువులుగా చెప్పుకోగలుగుతున్నాం. మన ఆరాధ్య దేవతలను చూడగలుగుతున్నాం” అని ఆయన పేర్కొన్నారు.

భివండి పట్టణంలో ఛత్రపతి శివాజీ ఆలయాన్ని నిర్మించినందుకు శివక్రాంతి ప్రతిష్ఠాన్‌కు చెందిన రాజు చౌదరికి దేవేంద్ర ఫడణవీస్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “ఈ గొప్ప కార్యం చేసినందుకు రాజు చౌదరికి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను” అని సీఎం పేర్కొన్నారు.

“ఈ ఆలయం చాలా అందంగా ఉంది. ఇక్కడ ఎత్తైన టవర్ ఉంది. సుందరమైన ప్రవేశ ద్వారం, తోట ప్రాంతం ఉన్నాయి. శివాజీ జీవితంలోని అన్ని సంఘటనలను మనం ఇక్కడ చూడొచ్చు. శివాజీ జననం నుంచి పట్టాభిషేకం వరకు, పులి దవడను ఛత్రపతి శంభాజీ మహారాజ్ విరిచిన క్షణం వరకు అన్ని ఘట్టాలను ఈ ఆలయంలో మనం చూడొచ్చు” అని ఫడణవీస్ తెలిపారు.

“ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆలయానికి తీర్థయాత్రా ప్రదేశంగా అధికారిక గుర్తింపును ఇస్తాం. దీని దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం” అని ఆయన వెల్లడించారు. కాగా,  ఔరంగజేబ్ సమాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటూ అది రక్షిత ప్రదేశాల జాబితాలో ఉందని, దాన్ని రక్షించడంలో గౌరవభావానికి తావు లేదని స్పష్టం చేశారు. కేవలం చారిత్రక రికార్డుల కోసమే రక్షించాల్సి వస్తోందని  ఫడణవీస్ చెప్పారు. 

“ఛత్రపతి శివాజీ ఆలయానికి మాత్రమే ప్రజల స్తుతిని పొందే అర్హత ఉంది. ఔరంగజేబ్ సమాధికి ఆ అర్హత లేదు. ఒకవేళ ఎవరైనా ఔరంగజేబును పొగిడే ప్రయత్నాలు చేస్తే అడ్డుకుంటాం” అని ముఖ్యమంత్రి వెల్లడించారు.  మహారాష్ట్రలోని 12 శివాజీ కోటలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని కోరుతూ మేం యునెస్కోకు ప్రతిపాదనలు పంపామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

“ఛత్రపతి శంభాజీ మహారాజ్‌‌ను మోసపూరితంగా బంధించిన సంగమేశ్వర్‌లో ఒక ప్యాలెస్‌ను నిర్మించాలని భావిస్తున్నాం. ఆగ్రా కోటలోని ఒక సెల్‌లో కొంతకాలం పాటు శివాజీ మహరాజ్‌ను బంధించారు. దాని నిర్వహణ బాధ్యతలను మహారాష్ట్ర సర్కారుకు ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని కోరాం. ఆ సెల్‌లో శివాజీ స్మారకం ఏర్పాటు చేస్తాం’’ అని దేవేంద్ర ఫడణవీస్ చెప్పారు.