పదేళ్లలో రూ.16.35 లక్షల కోట్ల మొండి బాకీల రద్దు

పదేళ్లలో రూ.16.35 లక్షల కోట్ల మొండి బాకీల రద్దు

గడిచిన 10 ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తంగా దాదాపు రూ. 16.35 లక్షల కోట్ల విలువైన మొండి బాకీలు (ఎన్‌పిఎ)లను బ్యాంక్‌లు రద్దు చేశాయని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంట్‌లో వెల్లడించారు.   ముఖ్యంగా 2018-19లో అత్యధికంగా రూ.2,36,265 కోట్ల పారు బకాయిలను మాఫీ చేశారు. 2014-15లో కనిష్టంగా రూ.58,786 కోట్ల ఎన్‌పిఎలను రద్దు చేయగా, 2023-24లో బ్యాంకులు రూ.1,70,270 కోట్ల బకాయిలను రద్దు చేశాయని సిపిఎం ఎంపీ అమ్రా రామ్ అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

2024 డిసెంబర్‌ 31 నాటికి వాణిజ్య బ్యాంకులు 29 కంపెనీలను ఎన్‌పిఎలుగా గుర్తించాయని మంత్రి తెలిపారు. వాటిలో ప్రతి ఒక్కటి రూ. 1,000 కోట్లకు పైగా బకాయిలు కలిగి ఉన్నాయని వెల్లడించారు. వీటి మొత్తం విలువ రూ.61,027 కోట్ల పైనేనని పేర్కొన్నారు.  గత పదేళ్లలో మొత్తంగా రూ.16.35 లక్షల కోట్ల మొండి బాకీలను రద్దు చేయగా, అందులో రూ.9,26,947 లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలు, సర్వీసు సెక్టార్‌ రంగాలకు చెందినవి కావడం గమనార్హం.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డులు ఆమోదించిన విధానం ప్రకారం బ్యాంకులు నాలుగేళ్లు పూర్తయిన తర్వాత పూర్తి ప్రొవిజనింగ్‌ (కేటాయింపులు) చేసిన వాటితో సహా నిరర్థక ఆస్తులను రద్దు చేస్తాయని మంత్రి సీతారామన్‌ తెలిపారు. రుణాల తిరిగి వసూలుకు బ్యాంకులు వివిధ మార్గాలను అనుసరిస్తాయని తెలిపారు. 

బ్యాంకులు వాటికి అందుబాటులో ఉన్న వివిధ రికవరీ యంత్రాంగాల ద్వారా రుణగ్రహీతలపై రికవరీ చర్యలు చేపడతాయని ఆమె చెప్పారు. సివిల్‌ కోర్టులు లేదా డెట్‌ రికవరీ ట్రైబ్యునళ్లు వంటి వాటిలో దావా వేయడంతోపాటు సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ అసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఇంట్రెస్ట్‌ యాక్ట్‌ కింద చర్యలు తీసుకోవడం, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో కేసులను దాఖలు చేయడం వంటివి చేస్తాయని ఆమె వివరించారు.

సివిల్‌ కోర్టుల్లో దావా వేయడం, రుణ రికవరీ ట్రిబ్యునళ్లు, ఎన్‌సిఎల్‌టి వంటి వాటిని ఆశ్రయించడం వంటి పద్ధతులను అనుసరిస్తాయని తెలిపారు. కాగా రద్దు చేసిన అప్పుల వల్ల రుణ గ్రహీతలకు ప్రయోజనం ఏమీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. కాగా ఎనిమిదో వేతన సంఘం (సీపీసీ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మరో ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్‌ తెలిపారు.