
అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, ఆయన భార్య మాజీ సర్పంచ్ పవిత్రాదేవికి ఇద్దరు కుమార్తెలున్నారు.
రెండో కుమార్తె ప్రగతి రెడ్డికి సిద్దిపేటకు సమీపంలోని బక్రి చప్రియాల్‌కు చెందిన రోహిత్ రెడ్డితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులున్నారు. రోహిత్ రెడ్డి తల్లి సునీత కూడా వారితోపాటే అమెరికాలో ఉన్నారు. ప్రగతిరెడ్డి, రోహిత్ రెడ్డి, వారి ఇద్దరు పిల్లలు, సునీత కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రగతిరెడ్డి, పెద్ద కుమారుడు అర్విన్, సునీత అక్కడికక్కడే మృతిచెందారు.
రోహిత్ రెడ్డి, చిన్నకుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో రోహిత్ కారు నడిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులను తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి (35), ఆమె కుమారుడు అర్విన్ (6), అత్త సునీత (56)గా గుర్తించారు.
సమాచారం తెలిసిన వెంటనే ప్రగతిరెడ్డి తల్లిదండ్రులు మోహన్ రెడ్డి, పవిత్రాదేవి అమెరికాకు బయలుదేరారు. మృతులకు ఫ్లోరిడాలోనే దహన సంస్కారాలు చేస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషాద వార్తతో టేకులపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
More Stories
పోప్ అంత్యక్రియలకు ముర్ము, ట్రంప్ సహా 2 లక్షల మంది హాజరు
పహల్గాం దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి
ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి అంగీకారం