ఛాంపియన్స్‌ ట్రోఫీ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డు

ఛాంపియన్స్‌ ట్రోఫీ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డు

దుబాయ్ లో ఇటీవల ముగిసిన ఛాంపియన్స్‌ ట్రోఫీ వ్యూయర్‌షిప్‌నకు సంబంధించిన వివరాలు ఐసిసి విడుదల చేసింది. ఈ టోర్నమెంట్‌కు 540.3 కోట్లకు పైగా వ్యూస్‌ వచ్చినట్లు, వాచ్‌ టైమ్‌ ఏకంగా 11వేల కోట్ల నిమిషాలకు పైగా నమోదయినట్లు వెల్లడించింది. అంతేకాదు మొత్తం మీద 6.2 కోట్ల మంది వ్యూయర్స్‌ ఈ మెగా ఈవెంట్‌ను వీక్షించినట్లు బ్రాడ్‌కాస్టర్‌ వెల్లడించింది. 

కాగా పాకిస్తాన్‌లో 1996 తర్వాత ఓ ఐసిసి టోర్నీ జరగడం ఇదే తొలిసారి. ఇక ఫిబ్రవరి 19న పాకిస్తాన్‌లో మొదలైన ఈ వన్డే ఈవెంట్‌ మార్చి 9న భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య దుబారు వేదికగా ఫైనల్‌తో ముగిసింది. 2025 చాంపియన్స్‌ ట్రోఫీని కోట్లాది మంది వీక్షించడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 540 కోట్లకు పైగా వ్యూస్‌ రావడం ఇదే తొలిసారి. 

స్టార్‌ స్పోర్ట్స్‌, స్పోర్ట్స్‌’ 18 నెట్‌వర్క్‌లో టీవీలో ప్రసారాలు జరుగగా, జియో హాట్‌స్టార్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. కాగా మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య ఫైనల్‌కు అత్యధిక వ్యూస్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్‌ పోరుకు ఏకంగా 124.2 కోట్ల వీక్షణలు వచ్చాయి. 

కాగా మొత్తంగా చాంపియన్స్‌ ట్రోఫీకి వచ్చిన వ్యూయర్‌షిప్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, గోవా, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల నుంచి 38 శాతం మేర వ్యూస్‌ వచ్చినట్లు సమాచారం. ఇక వైఫై సాయంతో మ్యాచ్‌ వీక్షించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు ఉంది. కాగా 16 మాధ్యమాల్లో చాంపియన్స్‌ ట్రోఫీని ప్రసారం చేశారు. తొమ్మిది భాషల్లో కామెంట్రీ ఇచ్చారు.