ఎస్ఎల్బీసీ టన్నెల్ లో రోబోలతో సహాయక చర్యలు

ఎస్ఎల్బీసీ టన్నెల్ లో రోబోలతో సహాయక చర్యలు

ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తు చిక్కుకుని ఇప్పటికీ ఆచూకీ తెలియని ఏడుగురి కోసం 19 రోజులుగా అన్వేషణ కొనసాగుతోంది. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన రెండు ప్రదేశాలను సిబ్బంది విస్తృతంగా తవ్వుతున్నారు. గల్లంతైన వారి జాడ కోసం శోధిస్తున్నారు. టీఎంబీ ముందు భాగానికి చేరుకునేందుకు, ఏడుగురి జాడ కనిపెట్టేందుకు రోబోలను సైతం రంగంలోకి దించారు.

రోబోతో రోబోటిక్స్ బృందం సొరంగంలోకి వెళ్లింది. మొదటి షిఫ్ట్లో సొరంగంలోకి 110 మంది రెస్క్యూ టీం వెళ్లింది. సొరంగం పైకప్పు కుప్పుకూలే అవకాశం ఉన్న చోట టైగర్ కాగ్స్ ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలతో సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలను నిర్వహిస్తున్నాయి. 

ప్రస్తుతం లోకో రైలు 13.5 కీలోమీటర్ల వరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇంకో 500 మీటర్ల వరకు శిథిలాలను సిబ్బంది తొలగిస్తున్నారు. ఊటనీరు సహాయక చర్యలకు కొంత ఆటంకంగా మారుతోంది. అయినా షిఫ్టుల వారిగా శ్రామికులు పనిచేస్తూనే ఉన్నారు. టీబీఎం ముందు భాగానికి చేరుకునేందుకు, ఏడుగురి జాడ కనిపెట్టేందుకు రోబోలను సైతం సహాయ చర్యల్లోకి దించారు.

సొరంగం లోపల పైకప్పు కూలిన ప్రాంతంలో విరిగిపడిన టన్నెల్ బోరింగ్ మిషన్ సహాయక చర్యలకు అడ్డుగా ఉండడంతో రైల్వే సిబ్బంది దానిని కట్ చేసి విడిభాగాలను బయటకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తం 1500టన్నుల బరువున్న ఈ మెషిన్ ను కట్ చేసి బయటకు తీసుకురావడం పెద్ద టాస్క్ గా మారింది.

16రోజుల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఒక మృతదేహం లభ్యమైంది. మృతుడిని ర్యాబిన్స్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. అతను పంజాబ్లోని చీమకలాన్ ప్రాంతానికి చెందినవాడు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన చోటే గురు ప్రీత్ మృతదేహం లభ్యమయింది. 12 గంటలపాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పంజాబ్ కు పంపించారు.