స్పష్టత లేని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం

స్పష్టత లేని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం
*   పీపుల్స్‌ పల్స్‌ రీసర్చ్‌  ఏపీ వ్యాప్తంగా సర్వే 
                           
జీవితంలో ఎవరి కెరీర్‌ కైనా ఇంటర్మీడియటే టర్నింగ్‌ పాయింట్‌. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గడాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దానికి కారణం పేదరికం, ఆకలేనని ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’’ ప్రారంభించింది.  ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆశించిన  లక్ష్యాలు నెరవేరుతున్నాయా? ఈ పథకం వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకోవడానికి పీపుల్స్‌ పల్స్‌ రీసర్చ్‌ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా పలు కాలేజీలను సందర్శించి, లోతుగా అధ్యయనం చేసింది.
ఈ పథకం కింద అందిస్తున్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రత, మౌలిక వసతులతో పాటు ఈ పథకంపై విద్యార్థి, విద్యార్థినుల అభిప్రాయం తెలుసుకోవడానికి రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు వివిధ మండలాల్లో ఉన్న 48 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ రీసెర్చర్లు సందర్శించారు. ఇందులో భాగంగా ప్రతి కాలేజీలో 25 శాంపిల్స్‌ చొప్పున మొత్తం 1200 శాంపిల్స్‌ తీసుకుని, ఈ పథకంలో ఉన్న లోటుపాట్లను  క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
 
పీపుల్స్‌ పల్స్‌ డైరెక్టర్‌ ఆర్‌.దిలీప్‌ రెడ్డి నేతృత్వంలో సంస్థ రీసెర్చర్లు జగదీష్‌, శ్రీధర్‌, నూతలపాటి రవికాంత్‌ క్షేత్రస్థాయిలో ఈ సర్వేను పర్యవేక్షించగా గణేష్‌ తండా, లక్ష్మీ,  జి.మురళీ కృష్ణ, ప్రదీప్‌, ప్రశాంత్‌, జంపాల ప్రవీణ్‌, ఐ.వి.మురళీ కృష్ణ శర్మ ఈ నివేదికను రూపొందించారు.
గోదావరి జిల్లాల్లో నిత్యాన్నదాతగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన ‘‘డొక్కా సీతమ్మ’’ పేరిట ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని రూపొందించారు. గతంలో పాఠశాలలకే పరిమితమైన ఈ పథకాన్ని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు కూడా విస్తరించారు. 2025 జనవరి 4వ తేదీన మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌ విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఈ పథకాన్ని లాంచనంగా ప్రారంభించగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కాలేజీల్లో హాజరు శాతం తగ్గడాన్ని గమనించిన తెలుగు దేశం ప్రభుత్వం 2018 ఆగస్టులో ఇంటర్‌ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది.  2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఈ పథకాన్ని నిలిపివేసింది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకాన్ని పున: ప్రారభించారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,48,419 మంది విద్యార్థులు ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’’ ద్వారా లబ్ది పొందుతున్నారు. ఈ పథకంలో భాగంగా భోజనం అందించడానికి 398 కాలేజీలను సమీపంలోని ప్రభుత్వ పాఠాశాలలకు అనుసంధానం చేయగా, మిగిలిన 77 కాలేజీలను సెంట్రలైజ్డ్‌ కిచెన్‌లకు అనుసంధానించారు. 
 
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 29.39 కోట్ల బడ్జెట్‌ కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 85.84 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
లోపభూయిష్టంగా జీవో 40
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన జీవో 40లో ఉన్న మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో పథకం అమలు చేయడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
*భోజనాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వండించి, కాలేజీలకు తరలిస్తున్నారు. కానీ, వాహన ఖర్చుల గురించి జీవోలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఈ రవాణా ఖర్చుకు సంబంధించి బడ్జెట్‌ లోపలే ప్రిన్సిపల్స్‌ బిల్లులు పెట్టుకోవచ్చని చెప్పినా  దీనికి ఎంత బడ్జెట్‌ అని మాత్రం చెప్పలేదు.
*విద్యార్థులకు అందించే భోజనం కోసం ఒక్కో ప్లేటుకు ఎన్ని గ్రాముల రైస్‌ ఇవ్వాలి? కూరలు, వాటిలో ఉండాల్సిన పోషకాలు, భోజనంలో ఇతర ఆహార పదార్థాలు ఏముండాలి? అనే అంశాలపై జీవోలో స్పష్టంగా పేర్కొనలేదు.
*జీవో నెం.40 ప్రకారం, ఒక్కో విద్యార్థికి భోజనానికి ఎంత కేటాయిస్తున్నారు? దానికి సంబంధించిన పోషకాహారాలు ఎంత ఉండాలి? ఒక్కో విద్యార్థికి భోజనం, కూర ఎన్ని గ్రాములు ఇవ్వాలి? తదతర అంశాలను జీవోలో ఎక్కడా పేర్కొనలేదు.
*భోజనం వండిన నాలుగు గంటల్లోనే విద్యార్థులకు వడ్డించాలని జీవో చెప్తోంది. కానీ, సెంట్రలైజ్డ్‌ కిచెన్ల నుంచి పొద్దున్నే వస్తున్న ఆహారం నాలుగు గంటల తర్వాతే వడ్డిస్తున్నారు. దీనివల్ల ఆహార పదార్థాలు చల్లబడిపోతున్నాయి.
*మేము సేకరించిన సమాచారం ప్రకారం ఒక్కో విద్యార్థికి భోజనానికి రూ.14.50లు మాత్రమే ప్రభుత్వం అందజేస్తోంది. ఈ విషయంపై జీవో 40 లో ఎక్కడా స్పష్టం చేయలేదు.
*రాష్ట్ర ప్రభుత్వం అక్షయపాత్ర, స్వచ్ఛంద సంస్థలు, డ్వాక్రా మహిళలు వండి విద్యార్థులకు అందించే ఆహారానికి ఒక్కో విద్యార్థికి కేవలం రూ.14.50 లు మాత్రమే అందిస్తుంది.
*ప్రభుత్వం కేవలం రేషన్‌ బియ్యం, కోడిగుడ్డు, చిక్కి మాత్రమే అందజేస్తోంది.
*డ్వాక్రా మహిళలు, అక్షయపాత్ర, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం ఇచ్చే రూ.14.50 ల్లోనే కూరగాయలు, గ్యాస్‌ సిలిండర్‌, వంటచెరుకు, నూనె, ఉప్పు, కారం, పసుపు, ఇతర వంట సామాగ్రిని వారే సమకూర్చుకోవాలి.\
*వంట సిబ్బందికి నెలకు రూ.3,000 జీతమే ఇస్తున్నారు. దీనికితోడు వంట సిబ్బందికి గ్యాస్‌ సిలిండర్లు కూడా తమ ఖర్చుతోనే కొనాల్సిన పరిస్థితి ఏర్పడటంతో  కూరలను నీళ్లలా వండుతున్న పరిస్థితి ఏర్పడడింది.
*ఈ పథకం అమలు, నిర్వాహణకు ఇంటర్‌ విద్య డైరెక్టర్‌ చర్యలు తీసుకుంటారని చెప్పినా… వారు ఏమి చేయాలి అని మాత్రం చెప్పలేదు. తనిఖీ వ్యవస్థ గురించి కూడా జీవోలో స్పష్టంగా పేర్కొనలేదు.

పిండి కొద్దీ రొట్టె

పిండికొద్దీ రొట్టె అన్న సామెతలాగా పథకానికి తగిన నిధులు కేటాయించకుండా ఆశించిన లక్ష్యాలు చేరుకోవడం సాధ్యం కాదు. ‘‘డొక్కా సీతమ్మ’’ భోజన పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల  విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం సాధ్యపడటం లేదు.  
ప్రస్తుతం ఏ కూరగాయల ధర చూసుకున్న కెజి రూ.40 కు తక్కువ లేదు. అదేవిధంగా మంచి నూనె కెజి రూ130 వరకు ఉంది. ప్రభుత్వం ఒక్క విద్యార్థికి కేటాయిస్తున్న రూ.14.50 ల్లో నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించడం సాధ్యపడటం లేదు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సరిపోకపోవడం వల్ల కూరలు, ఇతర ఆహార పదార్థాలు నాణ్యతపై ప్రభావం పడుతోంది. 
 
“ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న భోజనాన్ని తీసుకోవడానికి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ భోజనం చేయడానికి ఇష్టపడటం లేదు. నాణ్యమైన భోజనం పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని కర్నూల్‌లో  ఒక అధ్యాపకుడు వాఖ్యానించారు. కనీసం ఒక్కొక్క విద్యార్థికి ఒక్క భోజనానికి రూ.30 కేటాయిస్తేనే ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం విద్యార్థులకు అందించవచ్చు.
 
పాయకాపురం నుంచే సర్వే ప్రారంభం
 
మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్‌ ఈ పథకాన్ని ప్రారంభించిన విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నుంచే పీపుల్స్‌ పల్స్‌ సంస్థ ఈ సర్వేను ప్రారంభించింది. పథకం ప్రారంభించిన మొదటి రోజు ప్రజా ప్రతినిధులు, అధికారులు హడావిడి చేయడం తప్ప ఆ తర్వాత ఆ కాలేజీలకు ఎవరు రాలేదని, కనీసం తనిఖీలు కూడా చేయడంలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు.
 
 దీన్ని బట్టి చూస్తే ఆరంభ శూరత్వం తప్ప పథకం అమలు చేయడంలో ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి లేదని స్పష్టం అవుతోంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు వచ్చినప్పుడు నాణ్యమైన ఆహారం పెడతారని, తర్వాత నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆవేదనగా చెప్పారు. మెనూ ప్రకారం రాగి జావా ఇవ్వాలి. అయితే ఇప్పటి వరకు రాగి జావ అందని కాలేజీలే ఎక్కువగా ఉన్నాయి.
 
 పాయకాపురం కాలేజీకి అక్షయ పాత్ర సంస్థ భోజనం సరఫరా చేస్తోంది. అక్కడ మెను ప్రకారం ఎగ్‌ కర్రీ రావాల్సిన రోజు ఆలూ టమాటో కర్రీ రావడం మేం గమనించాం. మెనులో బటర్‌ మిల్క్‌ లేకపోయినా అక్షయ పాత్ర బటర్‌ మిల్క్‌ ఇస్తోంది. మెనూను పాటించడం లేదని చెప్పడానికి ఇలా అనేక ఉదంతాలను పలు కాలేజీల్లో పీపుల్స్‌ పల్స్‌ రికార్డు చేసింది.
 
బడుగు, బలహీనవర్గాల ఆకలి తీరుస్తున్న పథకం
ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తింటున్నారా?అని విద్యార్థులను ప్రశ్నించినప్పుడు తింటున్నామని 61.2 శాతం మంది చెప్పగా, 32.5 శాతం మంది అప్పుడప్పుడు తింటున్నామని, 1.3 శాతం మంది అక్కడ తినడం లేదని చెప్పారు. రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, కర్నూల్‌ లాంటి పట్టణాల్లో 50 శాతం మంది మాత్రమే మధ్యాహ్న భోజనం తింటున్నారు. మిగిలిన వాళ్లు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవడం లేదా ఇంటికి వెళ్లి తినడం చేస్తున్నారు. 
 
దీనిపై కొంతమందితో మాట్లాడినప్పుడు ‘‘నీళ్ల కూరలు, మెత్తటి అన్నం కంటే పొద్దున్న మా ఇంట్లో వండే అన్నమే బాగుంటుంది. అందుకే అంతకముందు లాగే రోజూ బాక్స్‌ తెచ్చుకుంటా’’ అని కాకినాడలో ఐశ్వర్య అనే విద్యార్థిని చెప్పారు.
నరసన్నపేటలో 450 మంది విద్యార్థులు ఉంటే 400 మంది భోజనం చేస్తున్నారు. కాకినాడ కాలేజీలో 690 మంది విద్యార్థులుంటే, 420 మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. సామర్లకోట కాలేజీలో 400 మంది విద్యార్థులుంటే 250 మంది భోజనం చేస్తున్నారు.
 
పాలకొండలో 400 మంది గాను 300 భోజనం చేస్తున్నారు. గొల్లప్రోలు కాలేజీలో 250 మంది విద్యార్థులుంటే కేవలం 60 నుంచి 70 మందే తింటున్నారు. పిఠాపురం కాలేజీలో 700 మంది విద్యార్థులుంటే 130 నుంచి 150 వరకు మాత్రమే  భోజనం చేస్తున్నారు. చాలా కాలేజీల్లో ఇదే పరిస్థితి ఉంది. మిగతావాళ్లు భోజనానికి సంక్షేమ హాస్టల్స్‌ లేదా ఇళ్లకు వెళ్ళిపోతున్నారు.
 
 నాణ్యతతో పాటు అక్కడ కూడా శుభత్ర లేకపోవడంతో  కొంతమంది కేవలం గుడ్డు, చిక్కి తీసుకుంటూ, భోజనం మాత్రం చేయడం లేదు. ఇలాంటి చోట్ల అధ్యాపకులు లేదా ప్రిన్సిపల్స్‌ చొరవ తీసుకుని పర్యవేక్షణ పెంచితే, భోజనం తినే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
 
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అధిక శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులే  చదువుకుంటున్నారు. బీసీలు 60 శాతం, ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 6 శాతం, ఓసీలు 12 శాతం ఈ మధ్యాహ్న భోజన పథకం వినియోగించుకుంటున్నారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రుల్లో అధిక శాతం మంది రైతులు, రోజువారి కూలీలు, ప్రయివేట్‌ ఉద్యోగులు, కార్మికులుగా పనిచేస్తున్నారు.  
వీరి పిల్లలు ఉదయం గ్రామాల నుంచి 8 గంటలకే బయల్దేరి చాలా దూరం ప్రయాణించి మండల కేంద్రాల్లో ఉండే జూనియర్‌ కాలేజీలకు చేరుకుంటారు. కొన్ని సార్లు ఇంటి నుండి లంచ్‌ బాక్స్‌ తెచ్చుకోవడం వీలుకాకపోవడంతో అప్పుడు అర్థాకలితో చదువుకుంటున్నారు. ఇలాంటి సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ‘‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’’ తీసుకురావడం మంచి విషయమే. అయితే పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించి ఈ పథకాన్ని బలోపేతం చేస్తేనే భావితరాలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం గుర్తించాలి.

మెనూ

ప్రభుత్వం విడుదల చేసిన మెనూ ప్రకారం సోమవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ. మంగళవారం అన్నం, కోడిగుడ్డు కూర, పప్పు, రసం, రాగిజావ. బుధవారం వెజ్‌ పులావ్‌, ఆలూ కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ. గురువారం అన్నం, కోడిగుడ్డు, కర్రీ, సాంబార్‌, రాగిజావ. శుక్రవారం పులిహార, గోంగూర లేదా కూరగాయలతో చేసిన చట్నీ, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ.శనివారం అన్నం, వెజ్‌ కర్రీ, కర్రీ, రసం, పొంగల్‌ స్వీట్‌ పెట్టాలి.
పీపుల్స్‌ పల్స్‌ సంస్థ పరిశీలించిన కాలేజీల్లో ఎక్కడా మెనూ బోర్డులు కనిపించలేదు. మెనూ ప్రకారమే అన్ని పదార్థాలు ఉంటున్నాయా? అని మా రీసెర్చర్లు విద్యార్థులను అడిగినప్పుడు ఉంటున్నాయి అని 76.7 శాతం మంది, కొంత తేడా ఉంటుందని 20.8 శాతం మంది, ఉండటం లేదని 2.5 శాతం మంది చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న మెను మీకు నచ్చిందా? లేక ఏమైనా మార్పులు చేయాలా? అని వారిని అడిగినప్పుడు 29.7 శాతం మంది నచ్చిందని చెప్పగా, 3.8 శాతం మంది నచ్చలేదని, 66.5 శాతం మంది మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పారు.
 
 ‘‘కోడి గుడ్డు ప్రతి రోజు కాకుండా, వారానికి మూడు, నాలుగు రోజులు పెడితే బాగుంటుందని,  కోడిగుడ్డుకు బదులు ఏదైనా పండు ఇచ్చినా ఒకే’’ అని గుంటూరులో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న వెంకటేశ్వర్లు చెప్పాడు. ఇంచుమించు ఇలాంటి అభిప్రాయాలే రాష్ట్రమంతా వెలువడ్డాయి. కాబట్టి, మెనూను మరింత మెరుగుపరచాలనే అభిప్రాయాలను ప్రభుత్వం పరిగనణలోకి తీసుకుంటే బాగుంటుంది.
 
భోజనంపై విద్యార్థుల అభిప్రాయం
మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉందని విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నప్పుడు 23.3 శాతం మంది బాగుందని చెప్పగా, 49.7 శాతం మంది పర్వాలేదని, 27 శాతం మంది బాగోలేదని చెప్పడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. మధ్యాహ్న భోజనం బాగుందా? లేక ప్రతి విద్యార్థికి మెస్‌ చార్జీలు ఇవ్వడం బెటరా? అనడిగినప్పుడు 83 శాతం మంది మధ్యాహ్న భోజనమే బెటర్‌ అని చెప్పారు. అంటే, వీరు  ప్రభుత్వం నుంచి మరింత మెరుగైన భోజనాన్ని ఆశిస్తున్నారని స్పష్టమవుతోంది.
గుంటూరు పెనుమాక గర్ల్స్‌ కాలేజీలో పీపుల్స్‌ బృందం పర్యటించినప్పుడు అక్కడ అక్షయ పాత్ర సంస్థ ఆహారం సరఫరా చేస్తోంది. వారు పంపిన పులిహోర పిల్లలు తినకుండా వదిలివేశారు. అక్షయపాత్ర అందజేస్తున్న ఆహారం ఉదయం 10.30కే ఆహారం రావడంతో అది మధ్యాహ్నానికి చల్లబడిపోవడం, మెత్తబడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రయివేట్‌ సంస్థలు సరఫరా చేస్తున్న ఇతర కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
(మిగతా రేపు)