చుట్టూ ఉన్నవాళ్ల మాటలు జగన్ వినడం వల్లే తాను పార్టీకి దూరమయ్యానని ఆ పార్టీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిశాక తన మనసు విరిగి పోయిందని, అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్ కు చెప్పానని తెలిపారు. చుట్టూ ఉన్న కోటరీ కారణంగా జగన్ కు తీవ్ర నష్టం జరుగుతుందని చెబుతూ దాని నుంచి బయటపడకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని ఆయన హెచ్చరించారు.
వైసీపీకి, దానితో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి అందుకు కారణాలపై మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో తనను ఎదగకుండా కొందరు కిందకు లాగారని ఆరోపించారు. తన మనసులో జగన్‌కు సుస్థిరమైన స్థానం ఉందని, అయితే జగన మనసులో మాత్రం తనకు స్థానం లేదని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు.
జగన్కు ఎవరినైనా పరిచయం చేయాలనుకుంటే, ముందుగా కోటరీకి లాభం చేకూర్చాల్సి ఉంటుందని విజయసాయిరెడ్డి అరోపించారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసు విచారణలో భాగంగా విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి బుధవారం హాజరయ్యారు. విచారణ అనంతరం మాట్లాడుతూ కోటరీ మాటలు వినొద్దని తాను జగన్‌కు చెప్పానని తెలిపారు.
భవిష్యత్‌లో మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేస్తూ విరిగిన మనసు మళ్లీ అతుక్కోదని, ప్రస్తుతం తాను ఏ పార్టీలో చేరాలనేదానిపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వైఎస్సార్సీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెబుతూ అనేక పదవులు ఇచ్చినా అవమానాలు తట్టుకోలేక పోయానని చెప్పుకొచ్చారు.
తాను ప్రలోభాలకు లొంగిపోయానని, విశ్వసనీయత కోల్పోయానని జగన్ అన్నారని పేర్కొంటూ అయితే తాను ప్రలోభాలకు లొంగిపోలేదని, జగన్లోనే మార్పు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు నాయకుడు అంటే భక్తి ఉండేది కానీ ఇప్పుడు దేవుడు మీద మాత్రమే భక్తి ఉందని తెలిపారు. నాయకుడనే వ్యక్తి చెప్పుడు మాటలు వినొద్దని, అలాంటి వ్యక్తి నాయకుడే కాదని పేర్కొంటూ ప్రజలు, పార్టీకి నష్టపోకతప్పదని స్పష్టం చేశారు. తనకు, జగన్‌కు మధ్య కొందరు విభేదాలు సృష్టించారని ఆరోపించారు.
కాగా, కాకినాడ పోర్టుల బదిలీ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌రెడ్డేనని విజయ సాయిరెడ్డి తేల్చి చెప్పారు. కేవీ రావు తనపై దురుద్దేశ్యంతోనే తనపై ఫిర్యాదు ఇచ్చారని, రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేశారని ఆరోపించారు.
సుబ్బారెడ్డి అమెరికాకు ఎప్పుడు వెళ్లినా కాలిఫోర్నియాలో కేవీ రావుకు చెందిన ఓ రాజభవనంలో ఉండేవారని, పోర్టు వ్యవహారంతో జగన్‌కు ఏమాత్రం సంబంధం లేదని, ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని స్పష్టం చేశారు. కేవీ రావు తెలుసా అని సీఐడీ అధికారులు అడిగారని, సామాజిక, ఆర్థిక అంశాల్లో తనకు కేవీ రావుకు అస్సలు పరిచయమే లేదని సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు.
అరబిందో నుంచి వాటాల బదిలీపై ప్రశ్నించారని చెబుతూ తన కుమార్తెను వారి ఇంటికి పంపించానే తప్ప, తనకు అరబిందో వాళ్లకు ఆర్థిక సంబంధాలు లేవని స్పష్టం చేశానని చెప్పారు. తన మీద ఎందుకు కేసు పెట్టారో కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీ రావును అడిగించానని, ఒక అధికారి ఆదేశాల మేరకు తన పేరు చెప్పినట్లు కేవీ రావు చెప్పారని వెల్లడించారు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత