* పోలవరంకు రూ 2,705 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధం
పదేళ్ల క్రితం రాజధాని అమరావతి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పనుల పునఃప్రారంభం కూడా వచ్చేనెలలో చేయనున్నారు. వచ్చే నెలలో అట్టహాసంగా పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దానికి ప్రధానిని ఆహ్వానించగా ఆయన అంగీకారం తెలిపినట్టు సమాచారం. తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. రా
జధాని పనుల పునఃప్రారంభానికి అతి త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. 2015 అక్టోబర్‌లో విజయదశిమి నాడు రాజధాని పనులకు ప్రధాని మోదీ చేతుల మీదుగానే ఘనంగా శంకుస్థాపన జరిగింది. రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిపై కక్షగట్టి, ఎక్కడి పనులు అక్కడే నిలిపేసింది.
మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి, అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూసింది. అమరావతి రైతుల ఉద్యమానికి టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా అండగా నిలిచింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పనుల్ని పట్టాలెక్కించేందుకు చర్యలు చేపట్టింది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా రాజధానికి పూర్తిస్థాయిలో అండగా నిలిచింది. కేంద్రం చొరవ వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.15000 కోట్ల రుణాన్ని అత్యంత వేగంగా మంజూరు చేశాయి. హడ్కో కూడా రూ. 11,000 కోట్లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకుల్ని ఈ 9నెలల్లో అధిగమించి రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది.
రూ. 37,702 కోట్ల పనులకు సంబంధించి 59 టెండర్లను సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. అన్ని పనుల్నీ దాదాపు ఒకేసారి ప్రారంభించబోతున్నారు. రూ. 40,000 కోట్ల విలువైన పనులకు సంబంధించిన టెండర్లను సీఆర్డీఏమంగళవారమే ఖరారు చేయడం గమనార్హం. ప్రధాని చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవంక, పోలవరం ప్రాజెక్టు సాకారం దిశగా మరో అడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం 2,705 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలు పచ్చజెండా ఊపాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ. 5,512 కోట్లను కేంద్రం ఇచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులివ్వడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సుమారుగా మరో రూ. 2,705 కోట్ల అడ్వాన్స్ విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఖాతాకు చేరనున్నాయి. తాజాగా ఇచ్చిన ఈ అడ్వాన్స్‌తో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పోలవరానికి రూ. 5,512 కోట్లు ఇచ్చినట్లయింది.
పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 2014 నుంచి ఇప్పటివరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో కేంద్రం నిధులు ఇవ్వలేదు. పైగా గతంలో మొదట రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆనక కేంద్రం రీయింబర్స్ చేసేది. అలాంటిది ఇప్పుడు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ. 5 వేల కోట్లకుపైగా అడ్వాన్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ ఇంత వేగంగా నిధులు రాబట్టిన దాఖలాలు లేవని పోలవరం అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత