ఎలన్‌ మస్క్‌తో విదేశాంగ, రవాణా మంత్రుల వాగ్వివాదం

ఎలన్‌ మస్క్‌తో విదేశాంగ, రవాణా మంత్రుల వాగ్వివాదం
అమెరికాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్వహించిన కేబినెట్‌ మీటింగ్‌లో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలిసింది. అధ్యక్షుడు ట్రంప్‌ ముందే ఇద్దరూ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగినట్లు అమెరికా మీడియా పేర్కొంది.
 
రూబియోతోనే కాకుండా రవాణా శాఖ మంత్రి సియాన్‌ డఫీతో కూడా మస్క్‌ వాదన పెట్టుకున్నారని న్యూయార్స్‌ టైమ్స్‌ కథనం వెలువరించింది. ప్రభుత్వ శాఖల వ్యయాన్ని తగ్గించే బాధ్యతలను చేపట్టిన డోజ్‌కు మస్క్‌ నేతృత్వం వహిస్తుండగా, ఇందులో భాగంగా అనేక ఉద్యోగాల్లో కోతలు విధిస్తుండటంపై  వాదన జరిగినట్టు తెలిపింది. 
 
ఉద్యోగాల్లో కోతలు కొనసాగుతాయని, అయితే గొడ్డలితో బదులుగా కత్తిని ఉపయోగిస్తామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ వివాదం గురించి ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఎలంటి ఘర్షణ లేదు, నేను అక్కడే వున్నానని చెప్పారు. పదే పదే పట్టుబట్టి ప్రశ్నించగా మస్క్‌, రూబియో అద్భుతంగా తమకు అప్పగించిన పనులు చేస్తున్నారని కొనియాడారు.

విదేశాంగ శాఖలో వ్యయం తగ్గింపు చర్యల గురించి ప్రశ్నిస్తూ మస్క్‌, మొదటి 45రోజుల కాలంలో రూబియో ఒక్కరిని కూడా ఉద్యోగం నుండి తొలగించలేదని వ్యాఖ్యానించారు. దీనికి రూబియో ఘాటుగా స్పందించారు. ఇప్పటికే 1500 మంది విదేశాంగ శాఖ ఉద్యోగులు ముందుగానే పదవీ విరమణ చేయడానికి అంగీకరించారని, ఒకవేళ తాను ఎవరినన్నా తీసేయాలనుకుంటే ఆ 1500మందిని మళ్లీ విధుల్లోకి తీసుకుని, తొలగించాలని వ్యంగంగా వ్యాఖ్యానించారు. 

మరోవైపు రవాణా శాఖ మంత్రి డఫీతో మస్క్‌కు చిన్నపాటి ఘర్షణ నెలకొంది. కీలకమైన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లను తొలగించడానికి మస్క్‌ ప్రయత్నిస్తున్నారని డఫీ ఆరోపించారు. దానిపై మస్క్‌ స్పందిస్తూ ఆయన అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈలోగా ట్రంప్‌ జోక్యం చేసుకుని వాదనలను సద్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. ఇకపై ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుతున్న మేథావుల నుండి కంట్రోలర్లను నియమించాల్సి వుందని వ్యాఖ్యానించారు.

రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌) శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ శాఖ బాధ్యతలను టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌కు అప్పగించారు. మెరుగైన పాలన, ప్రభుత్వంలో వృథా ఖర్చుల్ని తగ్గించేందుకు డోజ్‌ శాఖ వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ట్రంప్‌ కేబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు.