
* ఖలిస్థానీపై బ్రిటన్‌కు ఉదాసీనత ఎందుకు?
తీవ్రమైన నేరాల్లో శిక్షపడిన తీవ్రవాదులను విడుదల చేయడం ద్వారా బంగ్లాదేశ్‌లో శాంతియుత పరిస్థితులు క్షీణిస్తున్నాయని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల నెలకొన్న పరిస్థితులు ఆ దేశంలో భారత్ చేపట్టిన పలు అభివృద్ది ప్రాజెక్టులపై తీవ్రప్రభావం చూపినట్లు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో ఇటీవల నెలకొన్న పరిణామాలు, హిందువులపై జరిగిన దాడులు, ఆ కేసులు దర్యాప్తు తీరులను ప్రస్తావిస్తూ సమస్యలు పరిష్కరించగలిగే స్థిరమైన, శాంతియుతమైన బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారత మద్దతు ఉంటుందని తెలిపారు.బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వంతో చర్చలు జరిపి పెండింగ్ అనుమతులను పొందడం ద్వారా ఆ ప్రాజెక్ట్‌లపై ముందుకు సాగాలని భావిస్తున్నట్లు రణ్‌ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు.
“హిందువులు, ఇతర మైనారటీల ఆస్తులు, మతపరమైన సంస్థలను రక్షించడం బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం బాధ్యతని మేం పదేపదే నొక్కి చెబుతున్నాం. 2024 ఆగస్టు 5 నుంచి 2025 ఫిబ్రవరి 16 వరకు నమోదైన 2374 ఘటనల్లో కేవలం 1,254 ఘటనలను మాత్రమే పోలీసులు ధృవీకరించారు. 1,254 ఘటనల్లో 98 శాతం రాజకీయ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది” అని వివరించారు.
అయితే, బంగ్లాదేశ్ ప్రభుత్వం క్షుణ్ణంగా దర్యాప్తు చేసి హత్యలు, దమనకాండకు పాల్పడిన వారందరినీ చట్టం ముందు నిలబెట్టాలని కోరుతున్నట్లు తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నూతన సుంకాల నేపథ్యంలో పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపాలని ఇరు దేశాలు భావిస్తున్నట్లు రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.
అమెరికా పర్యటనలో ఉన్న వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పియూశ్ గోయల్ ఆ దిశగా ద్వైపాక్షి వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. భారత్-అమెరికా ద్విముఖ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పన్నుల అడ్డంకులను అధిగమించి రెండు దేశాల మధ్య సరఫరా గొలుసు ఏకీకరణ మరింత పెంచే దిశగా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు
విదేశాంగమంత్రి జైశంకర్ బ్రిటన్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంపై రణ్‌ధీర్ జైశ్వాల్ తీవ్రంగా స్పందించారు. ఖలిస్థానీ ఉగ్రవాద శక్తుల బెదిరింపులపై బ్రిటన్ వ్యవహరిస్తున్న ఉదాసీనతను ఆ ఘటన ప్రతిబింబిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి చర్యలు చేయడానికి వారికి లైసెన్సు ఇచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఈ దుశ్యర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోని బ్రిటన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని భారత్ డిమాండ్ చేసింది.
More Stories
హసీనాను స్వదేశానికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు
వంద ఏళ్లైనా ఏఐతో ప్రోగ్రామర్లను భర్తీ చేయలేరు
భారత్ ను మినహాయించి 22 దేశాలపై ట్రంప్ సుంకాలను