* భారతీయ కార్మికుడితో సహా నలుగురు మృతి
యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి “అత్యంత భారీ” డ్రోన్ దాడులలో ఒకదానిని ఉక్రెయిన్ ఆదివారం నాడు మోస్కోపై జరపడంతో, ఒక భారతీయ పౌరుడుతో సహా నలుగురు మరణించారు. భారీ సంఖ్యలోని డ్రోన్లతో రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. మరో ముగ్గురు భారతీయ కార్మికులు, మరికొందరు గాయపడ్డారు. రష్యాలోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది. దాడి జరిగిన ప్రదేశాన్ని అధికారులు సందర్శించారని, గాయపడిన కార్మికులను ఆసుపత్రిలో పరామర్శించినట్లు తెలిపింది.
‘ప్రాణనష్టం పట్ల రాయబార కార్యాలయం సంతాపం వ్యక్తం చేస్తోంది. భారతీయ కార్మికులకు అవసరమైన సహాయం అందించడానికి కంపెనీ యాజమాన్యం, స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తోంది’ అని భారత రాయబార కార్యాలయం ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. కాగా, ఆదివారం తెల్లవారుజామున రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు ఉక్రెయిన్ పాల్పడింది. రష్యా రాజధాని మాస్కోలోని కొన్ని ప్రాంతాలు, సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి.
24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1,000కు పైగా ఉక్రేనియన్ డ్రోన్‌లను అడ్డుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు రాజధాని వైపు దూసుకొచ్చిన సుమారు 81 డ్రోన్‌లను వాయు రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ తెలిపారు. ఈ దాడుల వల్ల పలు ప్రాంతాల్లోని నివాస భవనాలు, మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు చెప్పారు.
నలుగురు మరణించారని, వీరిలో ముగ్గురు మాస్కో ప్రాంతానికి చెందినవారని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని బెల్గోరోడ్ ప్రాంతంలో మరో మరణం నమోదైనట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆ డ్రోన్ దాడులను తర్వాత ధృవీకరిస్తూ, అవి “పూర్తిగా సమర్థనీయమైనవి” అని పేర్కొన్నారు.

More Stories
ఐదేళ్లలో తైవాన్ పై చైనా దాడి .. అమెరికా భయం!
11వ శతాబ్దం నాటి చోళుల రాగి పలకలు భారత్ కు అప్పగింత
బీజేపీ ఎన్నికల విజయాలపై అమెరికాలో సంబరాలు