
బేగంపేట విమానాశ్రయం నుంచి త్వరలోనే కమర్షియల్ విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు డొమెస్టిక్ సేవలను కూడా ఇక్కడ పునరుద్ధరిస్తే శంషాబాద్ ఎయిర్‌పోర్టుపై కొంతమేర ఒత్తిడి తగ్గుతుందని కేంద్ర విమానయాన సంస్థ భావిస్తున్నట్టుగా తెలిసింది. 1930లో నిజాం హయాంలో నిర్మించిన బేగంపేట విమానాశ్రయం ప్రస్తుతం వైమానిక దళ స్టేషన్‌గా సేవలందిస్తోంది.
2008లో మార్చి 23న శంషాబాద్‌లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభమైన తర్వాత ఇక్కడి నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి విఐపిలు ప్రయాణించే విమానాలు, ప్రైవేటు ఫ్లైట్ల ల్యాండింగ్‌కు ఇక్కడ అనుమతి ఉంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు హైదరాబాద్ పర్యటనకు వస్తే ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.
ఇలా ఉండగా, ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్‌పోర్టు వరకు ట్రాఫిక్ లేకుండా ఈజీగా ప్రయాణికులు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాడ్ బండ్ చౌరస్తా నుంచి బేగంపేట ఎయిర్ పోర్టు ద్వారా బాలంరాయి వరకు టన్నెల్ రోడ్డు నిర్మించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్టుగా తెలిసింది.
ఈ మేరకు బేగంపేట ఎయిర్ పోర్టు రన్ వేను ఆనుకొని 600 మీటర్ల వెడల్పుతో 1.1 కి.మీ సొరంగం నిర్మించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. విమానాశ్రయం ప్రహరీ పొడవునా తాడ్ బండ్ రోడ్డు వరకు 1.5 కి.మీ విశాలమైన రహదారిని నిర్మించాలని ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.
అంతకు ముందు ప్యారడైజ్ నుంచి సుచిత్ర సర్కిల్ వరకు స్కైవే నిర్మించాలని భావించగా ఎయిర్ పోర్టు అధికారులు దీనికి అభ్యంతరం తెలిపారు. దీంతో టన్నెల్ నిర్మించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఏఏఐకి హెచ్‌ఎండిఏ అధికారులు లేఖలు రాశారు. ప్రస్తుతం ఏఏఐ నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. ఒక వేళ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి కార్యకలాపాలు మొదలైతే టన్నెల్‌కు అనుమతి వస్తుందా? లేదా? అన్నది త్వరలోనే తేలనుంది.
More Stories
హెచ్‌సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్