కేంద్ర మంత్రి కుమార్తెతో పాటు పలువురు యువతులను ఒక జాతరలో కొంత మంది ఆకతాయిలు వేధించారు. ఈ నేపథ్యంలో ఆ మంత్రి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రుల కుటుంబాలకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు భద్రత ఎలా ఉంటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో మహిళలకు రక్షణపై ప్రశ్నలు లేవనెత్తారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి, బీజేపీ నాయకురాలు రక్షా ఖడ్సే కుమార్తెను కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా జల్గావ్‌లోని కోథలిలో నిర్వహించిన జాతరకు స్నేహితులతో కలిసి ఆమె వెళ్లింది. కొంతమంది యువకులు వారిని వేధించారు. వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. వారి ఫోటోలు, వీడియోలు తీశారు. సెక్యూరిటీ గార్డు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా అతడితో ఘర్షణ పడ్డారు.
కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే ఈ సంఘటనపై సీరియస్‌గా స్పందించారు. తన కుమార్తెను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తెను వేధించడంపై కలత చెందినట్లు తెలిపారు. ‘నేను కేంద్ర మంత్రిగా, ఎంపీగా కాకుండా న్యాయం కోరుతూ తల్లిగా వచ్చాను’ అని చెప్పారు. సెక్యూరిటీ ఉన్న ఒక ప్రజా ప్రతినిధి కుమార్తె వేధింపులకు గురైతే, సాధారణ పౌరుల భద్రత ఏమిటని ఆమె ప్రశ్నించారు.
“మహాశివరాత్రికి జరిగే సంత్ ముక్తాయ్‌కి తన స్నేహితులతో కలిసి వెళ్తానని నా కుమార్తె సెక్యూరిటీతో వెళ్లింది. అక్కడ తనను కొందరు యువకులు వెంబడించి వేధించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తించారు. నేను గుజరాత్ పర్యటన నుంచి రాగానే నాకు ఈ విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ఎంపి లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇంకా సామాన్య మహిళల పరిస్థితి ఏంటి?” అని రక్షా ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు మహారాష్ట్ర అంతటా మహిళలపై నేరాలు పెరిగాయని, చట్టాల పట్ల భయం లేకుండా పోయిందని మూడు సార్లు ఎంపీగా గెలిచిన రక్షా ఖడ్సే ఆరోపించారు. చాలా మంది అమ్మాయిలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడానికి వెనుకాడతారని తెలిపారు. అయితే మౌనంగా ఉండకూడదని చెప్పారు. ఆమె ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు ఈ ఘటనపై టెలిఫోన్ లో తెలిపి, ఇలాంటి సంఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా, కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే మైనర్ కుమార్తెను వేధించిన ఏడుగురు నిందితులను గుర్తించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ నిందితులను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. అయితే ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే చంద్రకాంత్ పాటిల్‌తో నిందితులకు సంబంధం ఉన్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి.
“ఈ సంఘటనలో ఒక నిర్దిష్ట పార్టీకి చెందిన వారి ప్రమేయం ఉండటం దురదృష్టకరం. పోలీసులు కొంతమంది నిందితులను అరెస్టు చేశారు, మరికొందరిని కూడా అరెస్టు చేస్తారు” అని ముఖ్యమంత్రి తెలిపారు. “బహిరంగ ప్రదేశంలో బాధితులకు బాధ కలిగించే వారి చర్యలు ఆమోదయోగ్యం కాదు. అలాంటి వారిని క్షమించలేము. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తేల్చి చెప్పారు.

More Stories
విదేశాల్లోని వారి చేతుల్లో యువత `పావులు’గా మారారు!
సంఘ పనిని క్రొత్త పుంతలు త్రొక్కించిన మా.శేషాద్రీజీ
70 బిలియన్ డాలర్ల విదేశీ నిధులకై ఆశాభావం