
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం తర్వాత దేశ రాజధానిలోని ఇంపీరియల్ హోటల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో త్వరలో బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో సహితం ఉమ్మడిగా పోటీచేసి విజయం సాధించాలని నిర్ణయించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జె పి నడ్డా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం తర్వాత, బిజెపి ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ సమక్షంలో, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్‌తో సహా రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఐక్యంగా, బలంగా పోటీ చేయాలని ఎన్డీఏ నాయకులు నిర్ణయించుకున్నారని తెలిపారు.
తవ్డే మాట్లాడుతూ, “ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నాయకులు ఢిల్లీకి వచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత, ఎన్డీఏ నాయకులందరూ సమావేశం నిర్వహించారు. దీనిలో మహారాష్ట్ర, ఢిల్లీలో బిజెపి విజయంపై ప్రధానమంత్రిని అభినందించారు. బీహార్ లేదా పశ్చిమ బెంగాల్‌లో అయినా, రాబోయే అన్ని ఎన్నికలకు కలిసి బలంగా పోరాడాలని ఎన్డీఏ నాయకులందరూ నిర్ణయించుకున్నారు. అన్ని పార్టీలు కలిసి ఎన్డీఏ బ్యానర్ కింద ఎన్నికలలో పోటీ చేస్తాయని వారు ప్రధానమంత్రికి హామీ ఇచ్చారు” అని చెప్పారు.
మహారాష్ట్ర, ఢిల్లీ లాగా ప్రతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలుస్తుందని నాయకులు ప్రధానమంత్రికి చెప్పారు. “మనం కలిసి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని సాధిస్తాం” అని ప్రధాని మోదీ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, గోవా సీఎం ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, త్రిపుర సీఎం మాణిక్ సాహా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ (ఏపీ), విజయ్ కుమార్ సిన్హా (బీహార్), ప్రేమ్ చంద్ బైర్వా (రాజస్థాన్), ఇతర నాయకులు కూడా హాజరయ్యారు.
More Stories
భారత్కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు.. 2027 నాటికి బుల్లెట్ రైలు