భారత్ లో ప్రవేశంకు సిద్దమవుతున్న టెస్లా

భారత్ లో ప్రవేశంకు సిద్దమవుతున్న టెస్లా
భారత ఈవీ మార్కెట్‌లో ప్రవేశించాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టెస్లా సంస్థ తాజాగా భారత్‌లో సిబ్బంది నియామకాలను ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో వివిధ పోస్టుల్లో ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టు లింక్డ్‌ఇన్ వేదికగా ప్రకటించింది. టెస్లా ప్రకటన ప్రకారం, సర్వీస్ టెక్నీషియన్, సలహదారు పోస్టులు వంటి వాటికి ఢిల్లీ, ముంబై నగరాల్లో నియామకాలు చేపడుతోంది.
 
మగిలిన పోస్టులకు నియామకాలు ముంబైలో చేపడుతోంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా అధినేత మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్లా భారత్‌లో నియామకాలు ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.  టెస్లా సంస్థ కొన్నే్ళ్లుగా భారత విపణిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది. 
 
అయితే, భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా గతంలోనే పేర్కొంది. 40 వేల డాలర్లకు పైబడిన ఖరీదైన కార్లపై భారత్ ఇప్పటివరకూ 110 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని విధించింది. ఇటీవల దీన్ని 70 శాతానికి తగ్గించింది. భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ చైనాతో పోలిస్తే చిన్నదే అయినా టెస్లాకు ప్రస్తుత పరిస్థితుల్లో కీలకంగా మారింది. 
 
భారత్‌లో గతేడాది లక్ష యూనిట్ల విద్యుత్ కార్లు విక్రయం కాగా చైనాలో ఈ సంఖ్య ఏకంగా 11 మిలియన్లు. అయితే, దశాబ్దం తరువాత తొలిసారిగా టెస్లా కార్ల అమ్మకాలు తగ్గాయి. దీనికి చెక్ పెట్టేందుకు భారత మార్కెట్‌లో ఎంట్రీకి టెస్లా ప్రయత్నిస్తోందని సమాచారం. ఇటీవల డోనాల్ట్ ట్రంప్‌తో సమావేశం అనంతరం ప్రధాని మోదీ అమెరికాతో వాణిజ్యలోటుపై దృష్టి పెట్టేందుకు అంగీకరించారు. 
 
రక్షణ రంగ కొనుగోళ్ల పెంపు, ఎఫ్-35 యుద్ధ విమానాల డీల్ వంటివి తెరపైకి వచ్చాయి. ఇక ట్రంప్ కేబినెట్‌లో కీలకంగా మారిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అయితే, మస్క్ వ్యక్తిగత హోదాలో మోదీని కలిశారా లేక అమెరికా ప్రభుత్వం తరుపున సమావేశమయ్యారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.