
రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ఖతార్ అధినేతకు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ భారత్‌కు సోమవారం చేరుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలకడం విశేషం. ఈ విషయాన్ని మోదీ ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించారు.
‘‘నా సోదరుడు, ఖతార్ ఎమిర్ హెచ్ హెచ్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్-థానీకి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లాను. ఆయన భారత్ పర్యటన ఫలవంతం అవుతుందని ఆశిస్తున. రేపు మేము ఇరువురం భేటీ కాబోతున్నాం’’ అని పేర్కొంటూ ఫొటోలను మోదీ పోస్ట్ చేశారు. విమానాశ్రయం నుంచి వచ్చిన అనంతరం విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్‌తో తమీమ్ బిన్ హమద్ భేటీ అయ్యారు.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఖతర్ ఎమిర్ మంగళవారం కలవనున్నారు. ఈ భేటీ తర్వాత హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరువురు భారత్- ఖతార్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు కీలక ఒప్పందాలు కూడా చేసుకుంటారని తెలిపింది.
ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వచ్చిన తమీమ్ బిన్ హమద్ భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో మార్చి 2015లో ఆయన భారత్‌కు వచ్చారు. మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత భారత్‌కు వచ్చారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని తాజా పర్యటన మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగశాఖ అభిప్రాయపడింది.
ఎమిర్ వెంట ఖతార్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన ప్రతినిధుల బృందం సైతం భారత్‌కు చేరుకుంది. ఇదిలా ఉండగా, భారత్, ఖతార్ మధ్య చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల మైత్రికి శతాబ్దాల చరిత్ర ఉంది. భారత్‌కు నమ్మకమైన భాగస్వాముల్లో ఖతార్ ఒకటి. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులు, ఎనర్జీ, టెక్నాలజీతో పాటు ప్రజల మధ్య బంధం మరింత బలోపేతమవుతోంది. ఖతార్‌లో నివసిస్తోన్న విదేశీయుల్లో భారతీయులే మొదటి స్థానంలో ఉండటం విశేషం.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి
జస్టిస్ వర్మపై సుప్రీం అంతర్గత విచారణ