అక్రమ వలసదారులతో అమృత్‌సర్‌ కు మరో రెండు విమానాలు

అక్రమ వలసదారులతో అమృత్‌సర్‌ కు మరో రెండు విమానాలు
భారత్ కు అక్రమ వలసదారులు తీసుకు వచ్చిన మరో రెండు అమెరికా సైనిక విమానాలు పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్నాయి. శనివారం రాత్రి 116 మందితో ఒక విమానం రాగా, 112 మందితో మూడో విమానం ఆదివారం రాత్రి చేరుకుంది. ఈ నెల 5న 104 మందితో వచ్చిన విమానం కూడా ఇదే విమానాశ్రంయలో దిగిన విషయం విదితమే. 
తాజాగా భారతీయులతో వచ్చిన ఎసి17 విమానం శనివారం రాత్రి 90 నిమిషాలు ఆలస్యంగా 11.35 గంటలకు అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది. ఇక వచ్చిన 116 మందిలో 60 మందికి పైగా పంజాబ్‌కు చెందినవారే ఉండడం గమనార్హం. 30 మందికి పైగా హర్యానాకు చెందినవారు.  గుజరాత్, ఉత్తర ప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌కుచెందిన వారు ఇద్దరేసి ఉండగా, జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారు ఒకరు ఉన్నారు.
వారిలో కొందరి కుటుంబాలు వారికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయం చేరుకున్నారు. ఆదివారం చేరుకున్న విమానంలో 33 మంది పంజాబ్ కు చెందినవారు ఉన్నారు. ఆదివారం రాత్రి 112 మందితో చేరుకున్న మూడో విమానంలో 44 మంది హర్యానా, 31 మంది పంజాబ్‌కు చెందిన వారు. అలాగే 33 మంది గుజరాత్‌కు చెందిన వారు. ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ఉండగా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ నుంచి చెరో ఒకరు ఉన్నారు.

పంజాబ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధలివాల్, విద్యుత్ శాఖ మంత్రి హర్భజన్ సింగ్ తిరిగివచ్చిన అక్రమ వలసదారుల్లో కొంత మందిని విమానాశ్రయంలో కలుసుకున్నారు.  దేశంలో అక్రమంగా నివసిస్తున్న 487 మంది భారతీయులను అమెరికా గుర్తించిందని, వారు త్వరలోనే భారత్‌కు చేరుకుంటారని భారత ప్రభుత్వం ప్రకటించిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
కాగా, సరైన పత్రాలు లేని వలసదారుల్ని స్వదేశం తిప్పిపంపుతున్న అమెరికా వారిపై అమానవీయంగా ప్రవర్తించడం మానడం లేదు. ఎన్ని విమర్శలు, ఆందోళనలు వస్తున్నా అమెరికా ప్రభుత్వం మాత్రం వారిని సంకెళ్లతోనే బంధించి సైనిక విమానాల్లో తరలిస్తుంది. ఈ విషయాన్ని స్వదేశం చేరకున్న భారత వలసదారులు స్వయంగా తెలిపారు. 
 
రెండో విమానంలో అమృత్‌సర్‌కు చేరుకున్న హౌషియార్‌పుర్‌ జిల్లా కురలా కలాన్‌కు చెందిన దిల్జిత్‌ సింగ్‌ అనే వ్యక్తి అమెరికా ప్రయాణం గురించి మీడియాతో మాట్లాడాడు. తిరిగి వచ్చే సమయంలో అమెరికా అధికారులు కాళ్లకు గొలుసులు, చేతులకు సంకెళ్లు వేశారని తెలిపారు. విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్‌ అయ్యే ముందు సంకెళ్లను తొలగించారని చెప్పారు. మహిళలకు మాత్రం సంకెళ్లు వేయలేదని తెలిపారు.