
ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన రెండురైళ్లు ఆలస్యం కావటం వల్ల డిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. మృతులలో 14 మంది మహిళలే. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ద్విసభ్య కమిటీని ఆదేశించింది. మరోవైపు ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
శనివారం రాత్రి తొమ్మిదిన్నరగంటల సమయంలో డిల్లీ రైల్వేస్టేషన్‌లోని 14, 15 నంబర్ ప్లాట్‌ఫాంలపై ఈ దర్ఘటన జరిగింది. కుంభమేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని రైళ్లు ఆలస్యమయ్యాయి. పెద్దఎత్తున యాత్రికులు రావటం వల్ల రైల్వేస్టేషన్ కిక్కిరిసిపోయింది. దీంతో ప్రయాగ్‌రాజ్‌కు మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ఆ రైలును అందుకునే క్రమంలో ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్‌ఫాంపైకి రావటం వల్ల తొక్కిసలాట జరిగింది. సుమారు 15 నుంచి 20 నిమిషాలపాటు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైల్వే పోలీసులు, 4 అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశాయి. మృతదేహాలతోపాటు క్షతగాత్రులను, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన అధికారులు భక్తులను గమ్యస్థానాలకు పంపారు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించాయి. ఘటనపై రైల్వే శాఖ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. అయితే ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులను నియంత్రించేందుకు రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు లేరని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంభం సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. డిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి చుట్టే తన ఆలోచనలు ఉన్నాయని పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.
ఈ ఘటన పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేస్తూ మృతుల కుటుంభ సభ్యులకు సంతాపం తెలిపారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన హితవు చెప్పారు. వెంటనే మృతులు, క్షతగాత్రులు, తప్పిపోయిన వారి ఖచ్చితమైన సంఖ్యను వెల్లడించాలని కోరారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆతిశీ, డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వెళ్లి పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్రవిచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి