
ఛత్తీస్‌గఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి తన సత్తాను నిరూపించుకుంది. ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో కాంగ్రెస్ ను తుడిచిపెట్టేసింది. ఛత్తీస్ గఢ్ లోని 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 49 మున్సిపల్ కౌన్సిల్ లు, 114 నగర పంచాయతీలకు ఫిబ్రవరి 11న పోలింగ్ జరిగింది. బీజేపీ 10 మున్సిపల్ కార్పొరేషన్లలో విజయ పతాకాన్ని ఎగురవేసింది.
అయితే కాంగ్రెస్ కార్పొరేషన్లలో ఖాతా కూడా తెరవలేకపోయింది. 49 మున్సిపాలిటీలలో బీజేపీ 35 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఆప్ కూడా మున్సిపాలిటీలలో ఒక స్థానాన్ని గెలుచుకుని ఖాతాను తెరిచింది. బోద్రిలో ఆప్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. కాగా 5 సీట్లు స్వతంత్రుల ఖాతాలోకి వెళ్లాయి.
నగర పంచాయతీలలో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 114 నగర పంచాయతీ స్థానాలకు గానూ బీజేపీ 81, కాంగ్రెస్ 22, బీఎస్పీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. కాగా 10 స్థానాలు స్వతంత్రుల ఖాతాలోకి వెళ్లాయి. మున్సిపల్ ఎన్నికల్లో విజయం తర్వాత ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు.
బీజేపీపై విశ్వాసం ఉంచిందనందుకు ఛత్తీస్ గఢ్ ఓటర్లకు మరోసారి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. అటల్ విశ్వాస్ పత్రంలో తాము ఇచ్చిన హామీలను 100 శాతం కచ్చితంగా నెరువేరుస్తామని సీఎం ప్రజలకు మరోసారి హామీ ఇచ్చారు. ఛత్తీస్ గఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు.
బీజేపీ సాధించిన విజయంపై సీఎం విష్ణుదేవ్ సాయి, రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమం, గిరిజన అనుకూల పథకాలపై రాష్ట్ర ప్రజల అచంచల విశ్వాసానికి ప్రతీక అని ఆయన స్పష్టం చేశారు.
ఛత్తీస్ గఢ్ మున్సిపల్ ఎన్నికల్లో 10 వేలకు పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని ఎన్నికల అధికారి వెల్లడించారు. ఓటింగ్ కోసం మొత్తం 5,970 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వీటిలో 1,531 పోలింగ్ కేంద్రాలు సున్నితమైనవిగా, 132 అత్యంత సున్నితమైనవిగా ప్రకటించబడ్డాయి. వివిధ మున్సిపాలిటీల్లో 32 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి తెలిపారు.
More Stories
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి
జస్టిస్ వర్మపై సుప్రీం అంతర్గత విచారణ
నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్లపాటు వాయిదా