
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ జరిపిన చర్చలు భారత్ కు ఆశాజనకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడితో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మన ప్రధాని హుందాగా నడుచుకున్నారని మాజీ కేంద్ర మంత్రి కొనియాడారు.
దేశం ఎదురు చూస్తున్న పలు సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని శశిథరూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా భారత్‌పై టారిఫ్‌లు విధిస్తున్నందున మనం కూడా తొందరపాటు చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం దేశం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులపై పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
కొందరు యువత తప్పుడు దారిలో అక్రమంగా విదేశాలకు వెళ్తున్నారని శశిథరూర్ విచారం వ్యక్తం చేశారు. అలా వెళ్లిన భారత పౌరులను తిరిగి తీసుకురావాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమ వలసలను నివారించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. “వాణిజ్యం, సుంకాల ప్రశ్నపై, వారు కలిసి కూర్చుని ఒక తీర్మానాన్ని చర్చించాలని నిర్ణయించుకున్నారు, ఇది రాబోయే నెలల్లో ఖరారు చేయబడుతుంది” అని ఆయన తెలిపారు.
వాణిజ్యం, సుంకాల విషయంలో చర్చల జరపాలని ఇరుదేశాలు నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని వ్యాఖ్యానించారు.అయితే వలసదారులను వెనక్కి పంపే సమయంలో అమెరికా వ్యవహరించిన తీరుపై భారత ఆందోళనను ట్రంప్‌నకు మోదీ తెలియజేసి ఉంటే బాగుండేదంటూ అభిప్రాయపడ్డారు.
“ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెస్‌మీట్ ఆశాజనకంగా ఉంది. ఆందోళనకరమైన అంశాలన్నింటి గురించి వారు మాట్లాడారు. ఉదాహరణకు వాణిజ్యం, సుంకాలు విషయంలో చర్చలు జరపాలని నిర్ణయించారు. సెప్టెంబరు, అక్టోబరు నాటికి చర్చలు పూర్తి కావచ్చు. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే చర్చించుకోవడానికి సమయం దొరికింది. లేకుంటే అధిక సుంకాల వల్ల భారత్ ఎగుమతులపై ప్రభావం పడేది.” అని శశి థరూర్ తెలిపారు.
ఇప్పటికే ఉన్న రఫేల్ యుద్ధవిమానాలకు ఎఫ్-35 తోడైతే వాయుసేన మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు. చైనా, పాకిస్థాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న వేళ ఎఫ్-35లను ఇస్తామని భారత్‌కు అమెరికా ఆఫర్ ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమని నిపుణులు అంటున్నారని చెప్పారు. “ఎఫ్-35 స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మనకు విక్రయించాలనే నిబద్ధత చాలా విలువైనది. ఎందుకంటే ఇది అత్యాధునిక ఫైటర్ జెట్. ఇది భారతదేశ రక్షణ సామర్థ్యాలను గణనీయంగా బలపరుస్తుంది” అని థరూర్ వ్యాఖ్యానించారు.
మోదీ అమెరికా పర్యటన ఫలితాల గురించి ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ, “ఇప్పటివరకు అందిన వివరాలతో నేను చాలా ప్రోత్సహించబడ్డాను. వలసదారులను తిరిగి పంపిన విధానంలో హామీ తప్ప, మనం ఆశించినదంతా మనకు లభించింది” అంటూ హర్షం వ్యక్తం చేశారు.
More Stories
ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
ముస్లిం రేజర్వేషన్లపై డికె వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం