రేవంత్ కట్టడి కోసమే తెలంగాణకు మీనాక్షి నటరాజన్!

రేవంత్ కట్టడి కోసమే తెలంగాణకు మీనాక్షి నటరాజన్!
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న దీపా దాస్ మున్షీ స్థానంలో కొత్త ఇంఛార్జీని ఆ పార్టీ అధిష్టానం నియమించడం రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో కలకలం రేపుతోంది. రాహుల్ గాంధీ టీంలో కీలక నేతగా ఉన్న మీనాక్షి నటరాజన్‌ను కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష వ్యవహారాలను కట్టడి చేసేందుకే తెలంగాణకు పంపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
 
ఇటీవల కొంత కాలంగా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇష్టపడటం లేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నియామకం జరగడం ఆసక్తి కలిగిస్తున్నది. ప్రస్తుతం ఇంఛార్జ్‌గా ఉన్న దీపా దాస్ మున్షీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలలో కఠినంగా వ్యవహరించటం లేదనే అభిప్రాయం ఉంది. అందుకనే ఆమెను మార్చబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.
 
తెలంగాణ ఇంఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. మీనాక్షి రాకతో తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పని చేస్తూ వచ్చారు. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ వంటి అనుబంధ సంస్థలలో పలు పదవుల్లో పని పని చేయడంతో పాటు ఏఐసీసీలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. 
 
2009లో మధ్యప్రదేశ్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో మంద్‌సౌర్ నుంచి పోటీ చేసిన మీనాక్షి ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. కానీ ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ ఓటమిపాలయ్యారు. ఎన్ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షురాలిగా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఏఐసీసీ కార్యదర్శిగా పలు హోదాలలో కాంగ్రెస్ లో పనిచేశారు. అయితే ఏఐసీసీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీమ్‌లో కీలక సభ్యురాలిగా గుర్తింపు పొందటం గమనార్హం.
 
ఇప్పటి వరకు ఇంఛార్జిగా ఉన్న దీప్‌ దాస్ మున్షీ కేరళ, తెలంగాణ రెండు రాష్ట్రాలు చూసుకుంటున్నారు. దీంతో ఆమె తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతుందన్న ఆరోపణలతో పాటు మరికొన్ని ఫిర్యాదులు కూడా రావటంతో అధిష్ఠానం ఈ కీలక నిర్ణయమే తీసుకుందని చెబుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆధిపత్యం పట్ల అసహనంతో వ్యవహరిస్తున్న తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆమె పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
దీపా దాస్ మున్షీ తమను కలవడం లేదని, తమ ఫోన్ లకు కూడా స్పందించకుండా తమను అవమానంపై గురిచేస్తున్నారని అంటూ ఆమెపై పలువురు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తున్నది. ఆమె రేవంత్ రెడ్డి చెప్పినట్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దానితో దీపా దాస్ మున్షీ తీరుతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఆమెను మార్చాలంటూ హైకమాండ్‌ దృష్టికి రాష్ట్ర నేతలు కొందరు తీసుకెళ్లారు.
 
దీంతో దీపా దాస్ మున్షీని కేరళకు పరిమితం చేసి, కొత్త నేతకు అది కూడా రాహుల్ గాంధీ టీంలోని నాయకురాలిని ఇంఛార్జ్‌గా నియమించటంతో పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది. 14 నెలలు అవుతున్నా మంత్రివర్గాన్ని విస్తరింప చేసుకోలేక పోవడం, పిసిసి కార్యవర్గ నియామకం జరగక పోవడంతో మీనాక్షి నటరాజన్‌ నియామకం రేవంత్ రెడ్డికి ఓ సవాల్ గా మారే అవకాశం ఉంది.